Published : 13 Feb 2022 17:10 IST

Priyanka Gandhi: ‘అమరీందర్‌ ప్రభుత్వాన్ని భాజపా నడిపింది.. అందుకే మార్చాం’

చండీగఢ్‌: పంజాబ్‌లో గతేడాది నాయకత్వ మార్పుపై కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంక గాంధీ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై తొలిసారి మౌనం వీడుతూ.. అప్పటి ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి భాజపా నడిపినందునే దాన్ని మార్చినట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్‌లోని కోట్కాపూరలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రియాంక ఈ మేరకు ప్రసంగించారు. ‘పంజాబ్‌లో ఏదో తప్పు జరుగుతోందని తెలిసింది. అందుకే నాయకత్వాన్ని మార్చాం’ అని అమరీందర్‌ సింగ్‌ పేరును ప్రస్తావించకుండా చెప్పారు. ‘అనంతరం మీలో ఒకరైన చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. పార్టీకి కనిపించారు. ఆయనకు మీ సమస్యల గురించి తెలుస’ని అన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)పైనా విమర్శలు చేస్తూ.. ఈ పార్టీ ఆరెస్సెస్‌ నుంచి పుట్టుకొచ్చిందని ఆరోపించారు.

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూతో అమరీందర్‌ విభేదాలు గతేడాది తారస్థాయి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక అవమానాలు భరించే శక్తి తనకు లేదంటూ అమరీందర్‌.. గతేడాది సెప్టెంబరులో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో సోనియా గాంధీతోపాటు రాహుల్, ప్రియాంకలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, అప్పట్లో వారు ఈ వ్యవహారంపై స్పందించలేదు. కొన్నాళ్లకు ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌’ ఏర్పాటు చేసిన అమరీందర్‌.. ప్రస్తుతం భాజపాతో కలిసి పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ.. చన్నీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తోంది. ఈ రాష్ట్రంలో ఫిబ్రవరి 20న పోలింగ్‌ జరగనుంది.

అన్నయ్య కోసం నా జీవితాన్నే త్యాగం చేస్తా..
రాహుల్‌ గాంధీ, ప్రియాంక మధ్య మనస్పర్ధలు ఉన్నాయంటూ భాజపా చేస్తున్న ఆరోపణలను ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. సోదరుడి కోసం తన జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్ధమేనన్న ఆమె.. తన కోసం రాహుల్‌ గాంధీ కూడా అదే పని చేస్తారని చెప్పారు. ఇద్దరి మధ్య విభేదాల వల్లే కాంగ్రెస్‌ పార్టీ పతనానికి కారణమంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంకా గాంధీ.. అసలు విభేదాలు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించారు. ‘అసలు ఘర్షణ యోగి మనసులోనే ఉంది. భాజపాలో యోగి, మోదీ, అమిత్‌ షాల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఆయన అలా మాట్లాడి ఉండవచ్చు’ అని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని