మా కూటమి దేశానికి వ్యతిరేకం కాదు: ఫరూక్‌

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పన, రద్దయిన హక్కులను తిరిగి సాధించుకోవడమే లక్ష్యంగా అక్కడి ప్రధాన ప్రాంతీయ పార్టీలు కలిసి ఓ కూటమిగా ఏర్పాటయ్యాయి. శనివారం ఆయా పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత...............

Updated : 13 May 2022 16:07 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ) పోరాటం చేస్తోందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. తమది భాజపా వ్యతిరేక వేదికే తప్ప దేశానికి వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. పీఏజీడీ దేశ వ్యతిరేకి అంటూ భాజపా అసత్య ప్రచారం చేస్తోందని, అది నిజం కాదన్నారు. ఇది భాజపా వ్యతిరేక కూటమి అనడంలో ఎలాంటి సందేహం అవసరంలేదని విలేకర్ల సమావేశంలో అన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి, కేంద్రం రద్దు చేసిన అధికారాలను తిరిగి సాధించుకోవడమే లక్ష్యంగా గుప్‌కార్‌ డిక్లరేషన్ నేతలు సమావేశమయ్యారు. ఆర్టికల్‌ 370, 35ఎ ను తిరిగి తీసుకువచ్చేందుకు గుప్‌కార్‌ కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. కార్యాచరణలో భాగంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లాను పీపుల్స్‌ అలయెన్స్‌ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అలాగే, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వైస్‌ ఛైర్మన్‌గా, వామపక్ష నేత మహమ్మద్‌ యూసుఫ్‌ తరిగామి కన్వీనర్‌గా, జమ్మూకశ్మీర్‌మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత సజ్జద్‌ లోనె అధికార ప్రతినిధిగా ఎన్నికయ్యారు. జమ్మూకశ్మీర్‌కు గతంలో ఉన్న జెండానే ఈ కూటమి తమ జెండాగా ఎంపికచేసుకుంది. గతేడాది ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కర్‌ డిక్లరేషన్‌ (ఏపీజీడీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫరూక్‌ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడం ద్వారా సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా భాజపా ప్రయత్నించిందని మండిపడ్డారు. గతేడాది ఆగస్టు 5న సమాఖ్య వ్యవస్థను భాజపా ఎలా విడగొట్టిందే అందరం చూశామంటూ వ్యాఖ్యానించారు.  జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రజల హక్కులను తిరిగి సాధించడమే తమ లక్ష్యమన్నారు. మతం పేరుతో జమ్మూకశ్మీర్‌‌, లద్దాఖ్‌లలోని ప్రజలను విడగొట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అది విజయవంతం కాదన్నారు. ఇది మతపరమైన యుద్ధం కాదన్న ఫరూక్‌.. తమ అస్తిత్వాన్ని కాపాడుకొనేందుకు ఐక్యంగా ఉద్యమిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని