Rahul Gandhi: అయోధ్య ఫలితం.. గుజరాత్‌లోనూ రిపీట్‌: రాహుల్

భాజపాను అయోధ్యలో ఓడించినట్లే గుజరాత్‌లోనూ ఓడిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలపై మోదీ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

Updated : 06 Jul 2024 19:53 IST

అహ్మదాబాద్‌: అయోధ్యలో (Ayodhya) భాజపాను ఓడించినట్లే.. గుజరాత్‌లోనూ (Gujarat) ఆ పార్టీపై ఇండియా కూటమి (India Bloc) విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత, రాయ్‌బరేలి ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో (Ahmedabad) పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు. ‘‘ కలిసికట్టుగా పోరాడి అయోధ్యలో భాజపాను ఓడించినట్లే.. గుజరాత్‌లోనూ నరేంద్రమోదీని, ఆ పార్టీని ఓడిస్తాం. విమానాశ్రయ నిర్మాణం పేరుతో అయోధ్యలోని సామాన్యుల భూములను కొల్లగొట్టారు. ఎంతో మంది తమ విలువైన స్థలాలు కోల్పోయారు. రామమందిర ప్రారంభోత్సవానికి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులను, ధనవంతులను ఆహ్వానించిన కేంద్రం.. స్థానికులను మాత్రం పిలవలేదు’’ అని విమర్శించారు. ఇటీవల రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాహుల్‌ పరామర్శించారు.

అగ్నివీరుల కుటుంబాలకు ఇచ్చే గౌరవం ఇదేనా?

కేంద్రం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకంపై తీవ్ర పార్లమెంట్‌ వేదికగా తీవ్ర అభ్యంతరం తెలిపిన రాహుల్‌ గాంధీ.. తాజాగా ‘ఎక్స్‌’ లో విమర్శలు గుప్పించారు. విధి నిర్వహణలో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన అగ్నివీరుడు అజయ్‌కుమార్‌ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి పరిహారం లభించలేదని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు. ఆర్మీ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ ఫండ్‌ నుంచి రూ.48 లక్షలు, ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి మరో రూ.50 లక్షలు వచ్చినట్లు అగ్నివీరుడి తండ్రి చెప్పారని.. అయితే అతడికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్స్‌గ్రేషియా సంగతి ఏంటని రాహుల్‌ ప్రశ్నించారు. జీతం బకాయిలు ఎందుకు అతడి ఖాతాలో జమ చేయలేదని నిలదీశారు.

‘‘ ప్రభుత్వం కేవలం ఇన్సూరెన్స్‌ మాత్రమే చెల్లించింది. ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదు. ఈ రెండింటికీ తేడా ఉంది. అగ్నివీరుడి కుటుంబానికి ఇన్సూరెన్స్‌ కంపెనీలే చెల్లించాయి తప్ప,  ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదు’’ అని రాహుల్‌ అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను కేంద్రం గౌరవించి తీరాలని, కానీ ప్రధాని మోదీ మాత్రం..  వారిపై వివక్ష చూపుతున్నారని రాహుల్‌ విమర్శించారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమన్న ఆయన.. కేంద్రం ఏమనుకున్నా సరే.. ఈ అంశాన్ని పదేపదే లేవనెత్తుతూనే ఉంటానని తెలిపారు. రక్షణ బలగాలను ఇండియా కూటమి ఎప్పటికీ బలహీన పరచబోదని స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని