Uddhav: రాజకీయంగా మాత్రమే దూరమయ్యాం!

ప్రధాని మోదీతో తన భేటీ పూర్తిగా వ్యక్తిగతమైనదని.. ఎలాంటి రాజకీయాలు కారణాలు లేవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. తనకు మోదీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు....

Published : 08 Jun 2021 15:31 IST

మోదీతో భేటీ అనంతరం ఉద్ధవ్‌ ఠాక్రే

దిల్లీ: ప్రధాని మోదీతో తన భేటీ పూర్తిగా వ్యక్తిగతమైనదని.. ఎలాంటి రాజకీయాలు కారణాలు లేవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. తనకు మోదీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రాజకీయంగా దూరమైనప్పటికీ.. తమ మధ్య ఇంకా మంచి సంబంధాలే కొనసాగుతున్నాయన్నారు. తాను కలవడానికి వెళ్లింది నవాజ్‌ షరీఫ్‌(పాక్‌ మాజీ ప్రధాని) కాదని.. ప్రధాని మోదీతో వ్యక్తిగతంగా భేటీ అవడంలో తప్పేమీ లేదని చమత్కరించారు.

మరాఠా రిజర్వేషన్లపైనే  ఠాక్రే.. మోదీతో చర్చలు జరపనున్నట్లు వీరివురి భేటీ ముందు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. మరాఠా రిజర్వేషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. అలా రిజర్వేషన్లు కల్పించే హక్కు కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్‌ ఈ విషయంపై నేరుగా దిల్లీలో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు గత నెల 31న శివసేన పత్రిక సామ్నాలో ప్రచురితమైంది. ఈ తరుణంలో ఉద్ధవ్‌ ఠాక్రే దిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

మరాఠా వర్గాన్ని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా ప్రకటించాలని గత నెల ఠాక్రే.. ప్రధానికి లేఖ కూడా రాశారు. మరాఠా రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినట్లు స్పష్టమైన ఆధారాలేవీ లేవని, వారికి 16శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 50శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని