AAP: మేం రెడీ.. ‘హిమాచల్‌’ ఓటర్ల తీర్పు మా వైపే..: ఆప్‌

హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh) ఎన్నికల షెడ్యూల్‌ని కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ప్రకటించడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) స్పందించింది.

Published : 15 Oct 2022 01:42 IST

దిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh) ఎన్నికల షెడ్యూల్‌ని కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ప్రకటించడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) స్పందించింది. ఎన్నికలకు తాము సిద్ధంగానే ఉన్నామని.. ప్రజా తీర్పు తమవైపే ఉంటుందన్న పూర్తి విశ్వాసంతో ఉన్నామని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాఠక్‌ అన్నారు. ప్రతి గ్రామంలో బృందాలు ఏర్పాటు చేశామని.. ప్రజలకు తమ పార్టీ సందేశాన్ని చేర్చేందుకు కష్టపడి పనిచేస్తున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్‌, భాజపా పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న తీరు, దిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం చేస్తున్న పనిని చూసి హిమాచల్‌ప్రదేశ్‌ ప్రజలు ఈసారి కచ్చితంగా ఆప్‌కి అవకాశం ఇస్తారని పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఇటీవల పంజాబ్‌లో ఏర్పాటైన భగవంత్‌ మాన్‌ సారథ్యంలోని ఆప్‌ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని దుర్గేశ్‌ చెప్పారు.

మరోవైపు, ఇప్పటివరకు హిమాచల్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో ద్విముఖ పోరే ఉండేది.  అధికార పీఠం కోసం కాంగ్రెస్‌, భాజపాలే ప్రధానంగా పోటీ పడుతుండేవి. కానీ ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగింది. దీంతో ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. పంజాబ్‌లో విజయోత్సాహంతో హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల కదనరంగంలోకి దూకుతోన్న ఆప్‌ గెలుపుకోసం అహర్నిశలూ శ్రమిస్తోంది. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఇప్పటికే ఆప్‌ ప్రకటించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో నవంబర్‌ 12న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్‌ 8న ఫలితాలు వెల్లడించనున్నట్టు ఈసీ తెలిపిన విషయం తెలిసిందే. హిమాచల్‌ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లు ఉండగా.. 2017లో జరిగిన ఎన్నికల్లో భాజపా 44 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ 21 చోట్ల విజయం సాధించింది. అలాగే, స్వతంత్రులు రెండు, సీపీఎం ఒకచోట విజయం సాధించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని