Published : 23 Jun 2022 17:43 IST

Maharashtra Crisis: మేం జోక్యం చేసుకోం.. ఠాక్రేపై విశ్వాసం ఉంది..

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే (Eknath Sindhe) శిబిరం వైపు 45మందికి పైగా శివసేన ఎమ్మెల్యేలు వెళ్లడంతో రాష్ట్రంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వం పతనం అంచులకు చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. శివసేన అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని.. కానీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై తమకు విశ్వాసం ఉందని తెలిపింది. మహారాష్ట్రలో స్థిరంగా ఉన్న ప్రభుత్వాన్ని  కూల్చేందుకు భాజపా చేస్తోన్న ప్రయత్నాలు మాత్రం విజయవంతం కావని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, లోక్‌సభాపక్ష ఉప నేత గౌరవ్‌ గొగొయి అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు, ముఖ్యమంత్రి పదవికి సంబంధించి తలెత్తుతోన్న ప్రశ్నలపై ఆయన దిల్లీలో స్పందించారు.

‘శివసేనపై మా అభిప్రాయాలు రుద్దడం ఇష్టంలేదని ఇదివరకే స్పష్టంచేశాం. అది పూర్తిగా వారి అంతర్గత వ్యవహారం. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై మాకు విశ్వాసం ఉంది. మహారాష్ట్రలోని మా సహచరులతో టచ్‌లో ఉన్నాం.. సుస్థిర ప్రభుత్వాన్ని పడగొట్టి, దేశంలో అస్థిరతకు గురిచేసే భాజపా ఉద్దేశాలు ఫలించబోవని మేం విశ్వసిస్తున్నాం. భాజపా వరుసగా అస్థిరతను సృష్టిస్తోందనడానికి ఇది మరో ఉదాహరణ’’ అన్నారు. 

దేశంలోని నిరుద్యోగ యువత వీధిన పడటం, కొవిడ్‌ కేసులు పెరగడం, వరదలు, రైతుల తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో భాజపా చేస్తున్న ఇలాంటి రాజకీయాలు ఆ పార్టీ అధికార దాహాన్ని తెలియజేస్తోందన్నారు. భాజపా అధికార దాహం వల్లే దేశం అభివృద్ధి నుంచి పట్టాలు తప్పుతోందని విమర్శించారు. అస్సాం వరదలతో అతలాకుతలమవుతుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. భాజపా అధికారం కోసం గుడ్డిగా వెళ్తోందని.. ఆ పార్టీకి అధికారమే సర్వస్వమని ఆక్షేపించారు. గువాహటిలో రాజకీయ వార్తల్ని కవర్‌ చేస్తున్న ముఖ్య మీడియా సంస్థలు సిల్చార్‌, కరీంగజ్‌లలోని ప్రజల బాధలను చూపించాలన్నారు. వారంతా తాగునీరు లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts