Updated : 29 Jun 2022 15:36 IST

Maharashtra crisis: బల పరీక్షలో నెగ్గేది మేమే.. ఎవరూ ఆపలేరు: ఏక్‌నాథ్‌ శిందే

గువాహటి: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు (Maharastra politics) శరవేగంగా మారుతున్నాయి. గురువారం తమ బలాన్ని నిరూపించుకోవాలంటూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సీఎం ఉద్దవ్‌ ఠాక్రేను (Uddhav Thackeray) ఆదేశించడంతో అక్కడి పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.  ఈ నేపథ్యంలో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్‌ శిందే ( Eknath Shinde) కీలక వ్యాఖ్యలు చేశారు.  సొంత పార్టీకి చెందిన 50మంది శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతు తమకు ఉందని వెల్లడించారు. బల పరీక్షలో తామే విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. గువాహటిలోని స్టార్‌ హోటల్‌లో ఉన్న ఆయన ఈరోజు వరుసగా రెండోసారి కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మాతో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడింట రెండొంతుల మంది కన్నా ఎక్కువ మెజార్టీనే ఉంది. బల పరీక్షపై మాకు ఎలాంటి ఆందోళన లేదు. పరీక్షలో మేమే నెగ్గుతాం’’ అన్నారు.

తమ బలాన్ని నిరూపించుకోవాలంటూ ఉద్ధవ్‌ ఠాక్రే సర్కార్‌ను గవర్నర్‌ ఆదేశించడాన్ని సవాల్‌ చేస్తూ శివసేన సుప్రీంకోర్టుకు వెళ్లడంపైనా ఆయన స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సంఖ్యాబలం, మెజార్టీనే ముఖ్యం గనక తమను ఎవరూ ఆపలేరన్నారు. రాజ్యాంగ పరిధిని దాటి వెళ్లాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. తాము చేస్తున్నదంతా మహారాష్ట్ర, హిందుత్వ అభివృద్ధి కోసమేనన్నారు. తమకే మెజార్టీ ఉందని విశ్వాసం వ్యక్తంచేశారు. రెబల్‌ ఎమ్మెల్యేలంతా ఉద్ధవ్‌ఠాక్రే సర్కార్‌కు ప్రత్యామ్నాయంగా భాజపాకు మద్దతిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. రేపటి బల పరీక్ష తర్వాత తామంతా సమావేశమై తదుపరి కార్యాచరణను నిర్ణయించుకుంటామన్నారు.

మరోవైపు, శివసేనలో నెలకొన్న సంక్షోభంతో తమకు సంబంధం లేదంటూనే ప్రతిపక్ష భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు జోరుగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా భాజపా ముఖ్య నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ హస్తినలో జేపీ నడ్డా, అమిత్‌ షాతో మంతనాలు సాగించారు. ఆ తర్వాత ముంబయి చేరుకొని.. ఎయిర్‌పోర్టు నుంచే నేరుగా గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ నివాసానికి వెళ్లడం.. ప్రస్తుత మహా వికాస్‌ అఘాడీకి మెజార్టీ లేదని.. బల నిరూపణకు ఆదేశించాలని కోరడం.. అర్ధరాత్రి దాటాక గవర్నర్‌ అందుకు ఆదేశాలు జారీచేయడం వంటి కీలక పరిణామాలు చకచకా జరిగిపోయిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts