
Mamata Banerjee: అందుకే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశాను: మమతా బెనర్జీ
కోల్‌కతా: రోమ్ పర్యటనకు అనుమతి నిరాకరణపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆదివారం మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘తమ పర్యటనల విషయంలో చాలా రాష్ట్రాల ప్రతినిధులు అనుమతులు తీసుకోరు. కానీ, మర్యాద, క్రమశిక్షణ పాటించే క్రమంలో అనుమతులు కోరాను. గతంలోనూ షికాగో, కేంబ్రిడ్జ్ తదితర చోట్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇలా ఎన్నింటిని నిలిపివేస్తారు?’ అని ప్రశ్నించారు. ‘బెంగాల్లో వారు ఓడిపోయారు. అయినా తమకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఏజెన్సీలను పంపుతున్నారు. దేశాన్ని అమ్మడమే వారి ఏకైక ఉద్దేశం. భవానీపూర్ ప్రారంభం మాత్రమే’ అని భాజపాను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ విషయం గురించి మమత మాట్లాడుతూ.. ‘గతంలో ఈ పార్టీలో ఉన్నప్పుడు సీపీఎంతో పోరాడాం. కానీ, కొన్నాళ్లకు అవి రెండూ పరస్పరం అవగాహన ఏర్పరచుకున్నందున.. బయటకు వచ్చేశాను. వాటి మధ్య అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు భాజపాతోనూ దోస్తీ ఉంది’’ అని మమత ఆరోపించారు. భాజపాను దేశం నుంచి తరిమేస్తామని, వారు గుజరాత్‌ను పూర్తిగా నాశనం చేశారని వ్యాఖ్యానించారు.
మరోవైపు.. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా భాజపాపై మండిపడ్డారు. మోదీ కంటే దీదీ ఎక్కువ పాపులర్ అయినందున.. రోమ్కు వెళ్లనివ్వడం లేదన్నారు. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆ రాష్ట్రంలో భాజపా.. తాలిబన్ల తరహాలో పాలన చేస్తోందని ఆరోపించారు. అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లేదని, ముఖ్యమంత్రే అన్నీ నిర్ణయిస్తున్నారన్నారు.