Chandrababu: అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం

‘ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది సైకోనే కాదు ఓ భూతం. అభివృద్ధిని అడ్డుకునే ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నేనే తీసుకుంటా. పెట్టుబడులు పెట్టాలని అక్కడికి రమ్మని కొందరిని అడిగితే.. మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్‌ రికార్డుంది.

Updated : 08 Jul 2024 06:49 IST

ఏపీకి వచ్చే పెట్టుబడిదారులకు భరోసా ఇస్తాం 
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తా 
గొడవలతో అభివృద్ధికి ఆటంకం 
ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యల పరిష్కారం
తెలంగాణ తెదేపా కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు
జూబ్లీహిల్స్‌ నుంచి భారీ ర్యాలీ 
ఘనంగా సత్కరించిన నేతలు
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ వద్ద పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు

  • ఏపీలో అర్హతలేని వారు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందన్నదానికి గత ఐదేళ్ల పాలనే నిదర్శనం. రాజకీయాల్లో మంచి వాళ్లు ఉంటే ఏం జరుగుతుందో నిరూపించే అవకాశం ఏపీలో నాకు వచ్చింది. అక్కడ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది అన్నీ ఈ రోజే అయిపోవాలని ఆలోచిస్తున్నారు. కానీ ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది. సమస్యల సుడిగుండంలో ఉన్నాం. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నా నైజం. ముందుకు వెళతాం. అక్కడ కోకొల్లలుగా ఉన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత నాకుంది.
  • తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములుగా కొనసాగుదాం. నేను..ఏపీ, తెలంగాణ అని కాకుండా తెలుగు ప్రజల కోసం పనిచేస్తా. కొందరు గొడవ పడాలంటున్నారు. కానీ గొడవ పడితే నీళ్లు రావు. పలు విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. సామరస్యంగా చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. 
  • మా మంత్రులకు ఒకటే చెబుతున్నా.. విర్రవీగొద్దు. భూమ్మీద నడవాలి. ప్రజలకు సేవకులం. పెత్తందారులం కాదని అందరికీ హితబోధ చేస్తున్నా. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 


‘ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది సైకోనే కాదు ఓ భూతం. అభివృద్ధిని అడ్డుకునే ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నేనే తీసుకుంటా. పెట్టుబడులు పెట్టాలని అక్కడికి రమ్మని కొందరిని అడిగితే.. మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్‌ రికార్డుంది. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. ఒకవేళ మళ్లీ ఆ భూతం ఎప్పుడైనా ముందుకు వస్తే మేం ఏం అవుతాం? అని అడుగుతున్నారు. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత నేను తీసుకుంటానని వారికి చెబుతున్నా’ అని తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు ఆదివారం వచ్చారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ర్యాలీగా వచ్చిన ఆయనను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. వేలమంది కార్యకర్తలతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్, పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తా’ అని వివరించారు.

చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో తెదేపా ఉండాలా.. అని ప్రశ్నించటంతో ఉండాలంటూ చేతులెత్తి ఉత్సాహంగా చెబుతున్న పార్టీ కార్యకర్తలు

ఏపీలో రీస్ట్రక్చరింగ్‌ ప్రారంభించా

‘మొన్న ఏపీలో ఎన్నికలప్పుడు నేను వినూత్నంగా ఆలోచించా.. రీస్ట్రక్చరింగ్‌ ప్రారంభించాను. యువత, ఉత్సాహవంతులు, చదువుకున్నవారినీ సామాజిక న్యాయమే ధ్యేయంగా పెట్టుకుని బరిలో నిలిపా. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒక సునామీ వచ్చింది. వైకాపా కొట్టుకుపోయింది’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ జనసేనాని పవన్‌ కల్యాణ్ ముందుకొచ్చారు. నేను జైల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి తెదేపాతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత భాజపా ముందుకు వచ్చింది. ఏపీని పునర్నిర్మాణం చేయాలనుకున్నాం. పొత్తులు బాగా పనిచేశాయి. తెలంగాణ నుంచి ఎన్నికలకు ముందురోజు 60-70 రైళ్లలో ఏపీకి కిక్కిరిసి వచ్చారు. ఈ ప్రాంతం నుంచి పేదలు, చిన్నపనులు చేసేవారూ వచ్చి ఓటేశారు. విదేశాల నుంచి ఎన్‌ఆర్‌ఐలు రూ.లక్షలు ఖర్చుపెట్టుకుని వచ్చి ఓటేసివెళ్లారు.. వారందరి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. 

పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్న చంద్రబాబు, వేదికపై అరవింద్‌కుమార్‌ గౌడ్, బక్కని నర్సింలు, సుహాసిని, జ్యోత్స్న

గొడవలు అభివృద్ధికి ఆటంకం

‘తెలుగుజాతి ప్రయోజనాల విషయంలో అందరం కలిసి పనిచేయాలి. శనివారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో.. అధికార కమిటీలు వేసుకున్నాం. రెండు రాష్ట్రాల సమస్యల్నీ రానున్నరోజుల్లో ఒక దారికి తీస్తాం. గతంలో నేను చేసిన అభివృద్ధిని కొందరు వక్రీకరించారు. మొత్తం హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినందుకే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిందంటూ నాపై శాపనార్థాలు పెట్టారు. నేను ఆ రోజు, ఈరోజు చెబుతున్నా.. ముందు ఒక ప్రాంతంతో అభివృద్ధి జరగాలి. రాజధానితో అభివృద్ధి ప్రారంభమైతే మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తుంది. 2014లో ఏపీ విడిపోయినప్పుడు.. ఏపీ కంటే తెలంగాణ తలసరి ఆదాయం 35 శాతం ఎక్కువగా ఉంది. నేను ఏపీ సీఎంగా 2014-19 మధ్య బాగా కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని 27.5 శాతానికి తగ్గించా. ఆ తర్వాత ఏపీలో విధ్వంసకర ప్రభుత్వం వచ్చింది. విభజన వల్ల జరిగిన నష్టం కంటే అక్కడి పాలన వల్ల నష్టం ఎక్కువ జరిగింది. ఈ సారి ఏపీలో తెదేపా ప్రభుత్వ రాకపోయి ఉంటే.. తెలంగాణకు, ఏపీకి మధ్య తలసరి ఆదాయం 100 శాతం మేర వ్యత్యాసం వచ్చేది’ అని ఆయన వివరించారు.

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌ నుంచి బంజారాహిల్స్‌ వరకు తెదేపా కార్యకర్తల ర్యాలీ, చంద్రబాబు కాన్వాయ్‌

భావోద్వేగాలు శాశ్వతంగా ఉండొద్దు 

‘రాజకీయం అంటే వ్యాపారాలు చేసుకోవడం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు. ప్రజల జీవితాల్లో వెలుగు చూపించడం నిజమైన రాజకీయం. నేను ఆ రోజు ఆలోచించి హైటెక్‌ సిటీతో ప్రారంభించా. ఆ తర్వాత జరిగిన అభివృద్ధితో హైదరాబాద్, తెలంగాణ దేశంలో నంబర్‌ వన్‌ అయ్యింది. నేను సీఎం కాగానే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నేనే లేఖ రాశా. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలున్నాయి. పరిష్కారం చేద్దాం..నేను వచ్చి కలుస్తా అని కోరాను. తెలంగాణ సీఎం సానుకూలంగా స్పందించారు. రేవంత్‌రెడ్డికి మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. అన్నదమ్ములు విడిపోయినప్పుడు చిన్నచిన్న సమస్యలు వస్తాయి. భావోద్వేగాలుంటాయి కానీ అవి శాశ్వతంగా ఉండొద్దు. బయటవారు మనమీదకు వస్తే..మనం ఒకటే అని నిరూపించే ఐకమత్యం ఇప్పుడు ఉండాలి. రెండు రాష్ట్రాలు..తెలుగుజాతి ప్రయోజనాలు కాపాడేందుకు ముందుంటా.   రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది.. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన చర్చలు చాలావరకు ముందుకు తీసుకెళతాయని నేను ఆశిస్తున్నా’ అని స్పష్టం చేశారు. తెలంగాణలో తెదేపాకు పూర్వ వైభవం వస్తుందని ఆకాంక్షించారు. 

అభివృద్ధిని కొనసాగించిన ప్రభుత్వాలు

హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. అందుకు కారణం తెదేపా హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి. ఆ తర్వాత పదేళ్ల చొప్పున పాలించిన కాంగ్రెస్, భారాస ప్రభుత్వాలు కొనసాగించాయి. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,08,732. ఇది గుజరాత్, మహారాష్ట్రల కంటే ఎక్కువ. విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం రూ. 2,19,518 మాత్రమే ఉంది. ఆదాయం పుంజుకోవడంతో తెలంగాణకు మంచి బేస్‌ వచ్చింది. తర్వాతి స్థాయికి తీసుకెళ్లేందుకు ఇక్కడి పాలకులకు అవకాశం ఉంది. రేవంత్‌రెడ్డి బాగా పనిచేస్తున్నారు’ అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కంభంపాటి రామ్మోహన్‌రావు, బక్కని నర్సింహులు, అరవింద్‌కుమార్‌గౌడ్, నందమూరి సుహాసిని, జ్యోత్స్న, కాట్రగడ్డ ప్రసూన, నర్సిరెడ్డి, కాశీనాథ్, ప్రేంకుమార్‌జైన్, బంటు వెంకటేశ్వర్లు, సామ భూపాల్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని