Yanamala Ramakrishnudu: క్యాబినెట్‌లో యువతకు ప్రాధాన్యాన్ని స్వాగతిస్తున్నాం: యనమల రామకృష్ణుడు

‘‘రాష్ట్ర మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో 50% కంటే ఎక్కువమంది యువతకు మంత్రి పదవులు ఇచ్చారు’’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

Updated : 15 Jun 2024 09:53 IST

ఈనాడు, అమరావతి: ‘‘రాష్ట్ర మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో 50% కంటే ఎక్కువమంది యువతకు మంత్రి పదవులు ఇచ్చారు’’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబును సచివాలయంలో శుక్రవారం సాయంత్రం కలిసిన అనంతరం రెండో బ్లాక్‌ దగ్గర విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘‘ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు కోరుకున్న మార్పు.. దానికి అనుగుణంగా క్యాబినెట్‌ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత క్యాబినెట్‌ అందుకు అనుగుణంగా ఉంది. చిత్తశుద్ధితో పనిచేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ నాకు 29 ఏళ్లకే అవకాశం ఇచ్చారు. చిత్తశుద్ధితో పనిచేశాం కాబట్టే ఈ స్థాయికి రాగలిగాం. సీనియర్లు పార్టీకి ఉపయోగపడాలి, యువతకు అవకాశాలు ఇవ్వాలి. పాత, కొత్త కలయిక ఉంటేనే రాష్ట్రానికి ఉపయోగం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. ప్రజలు కోరుకున్న విధంగా మార్పులు తెస్తామని హామీలు ఇచ్చాం. 30 ఏళ్లు అధికారంలో ఉంటానన్న సీఎం జగన్‌ కళ్లు ఐదేళ్లలోనే ప్రజలు మూసేశారు. ప్రజలు కోరుకున్నట్లు ఆయన ఏమీ చేయలేకపోయారు. ఐదేళ్ల పాలనతో ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆయన సంక్షోభంలోకి నెట్టేశారు. చంద్రబాబు సమర్థతతో రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి. అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారు’’ అని రామకృష్ణుడు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని