Sharad Pawar: అసెంబ్లీ ఎన్నికల్లో మేమంతా కలసి పోటీచేస్తాం : శరద్‌ పవార్‌

మరో నాలుగు మాసాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్‌ కలిసే పోటీ చేస్తాయని శరద్‌ పవార్‌ అన్నారు.

Updated : 30 Jun 2024 16:58 IST

పుణె: మరో నాలుగు నెలల్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్‌ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్‌ అఘాడీలోని పార్టీలన్నీ కలిసే పోటీ చేస్తాయని కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) వెల్లడించారు. ఆదివారం ఆయన పుణెలో మీడియాతో మాట్లాడుతూ..   ఎన్సీపీ(ఎస్‌పీ),  శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌ ఉమ్మడిగా బరిలోకి దిగుతాయని స్పష్టం చేశారు. అలాగే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమిలో భాగస్వాములుగా ఉన్న వామపక్షాలు, పీడబ్ల్యూపీ వంటి మిత్రపక్షాల ప్రయోజనాల్ని పరిరక్షించడం తమ నైతిక బాధ్యత అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వారికి సీట్లు ఇవ్వలేకపోయామని.. ఈసారి వారి ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ దృష్టంతా మహారాష్ట్ర ఎన్నికలపైనే ఉందన్నారు.

ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ

2019లో ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలో ఏర్పాటైన మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం 2022 జూన్‌ వరకు కొనసాగింది. ఆ తర్వాత శివసేన నుంచి శిందే చీలికవర్గం తిరుగుబాటుతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఆ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి జరిగే తాము కలిసే ఎన్నికల బరిలో నిలుస్తామని, రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పవార్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమకు మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందిస్తూ.. ‘‘మీరు ఖాళీ జేబుతో మార్కెట్‌కు వెళ్తే ఏం జరుగుతుంది? ఇంకొద్ది రోజులు ఆగండి..  అసలు విషయం తెలుస్తుంది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉండటంతో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం 21 నుంచి 60 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వడంతో పాటు ఒక్కో కుటుంబానికి మూడు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లు, రైతు అనుకూల విధానాలు చేపట్టడంతో పాటు, యువత నైపుణ్య శిక్షణకు రూ.10వేలు చొప్పున స్టైఫండ్‌ ఇస్తామంటూ శిందే సర్కారు హామీ ఇవ్వడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు పవార్‌ పైవిధంగా వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని