AAP: ఉత్తరాఖండ్‌ను అంతర్జాతీయ ఆధ్యాత్మిక రాజధానిగా చేస్తాం: కేజ్రీవాల్‌

ఉత్తరాఖండ్‌లో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని హిందువుల అంతర్జాతీయ ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దుతామని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో జరగనున్న ఎన్నికల్లో ఆప్‌ పార్టీ

Published : 08 Feb 2022 01:22 IST

దెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని హిందువుల అంతర్జాతీయ ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దుతామని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో ఆప్‌ పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కేజ్రీవాల్‌ పర్యటిస్తూ ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘‘ఉత్తరాఖండ్‌ను హిందువుల అంతర్జాతీయ ఆధ్యాత్మిక రాజధానిగా చేస్తాం. దీని వల్ల పర్యటక రంగం అభివృద్ధి చెందుతుంది. అలాగే, వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ ఎన్నికల్లో సంచలన మార్పు చోటుచేసుకోబోతుంది. రాష్ట్రంలో తొలిసారిగా ఒక నిజాయితీగల ప్రభుత్వం ఏర్పడి అవినీతిని నిర్మూలించవచ్చు’’అని కేజ్రీవాల్‌ తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ట్రంలోని హిందువులకు అయోధ్య రామాలయ సందర్శన, ముస్లింలకు అజ్మీర్‌ షరిఫ్‌ దర్శనానికి తామే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు అధికార పార్టీ భాజపా కూడా ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామితో పాటు భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాష్ట్రంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ రెజ్లర్‌ బబితా ఫోగట్‌.. భాజపా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపే ఓ వీడియోను సైతం ఇటీవల సీఎం ధామి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. తాజాగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌కుమార్‌ను భాజాపా సర్కార్‌ నియమించింది. ఈ మేరకు సోమవారం అక్షయ్‌కుమార్‌ సీఎం ఇంటికి వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని 70 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 14న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని