Maharashtra Crisis: ఆఖరి క్షణం వరకూ ఉద్ధవ్‌ ఠాక్రే వెంటే ఉంటాం: అజిత్‌ పవార్‌

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే శిబిరం వైపు వెళ్లే ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) ....

Published : 24 Jun 2022 01:28 IST

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే శిబిరం వైపు వెళ్లే ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పతనం అంచులకు చేరింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మూడు పార్టీల (శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీ)పైనా ఉందన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలంతా 24గంటల్లో ముంబయికి వచ్చేస్తే.. కూటమి ప్రభుత్వం నుంచి తప్పుకొనే అంశాన్ని పరిశీలిస్తామని సంజయ్‌ రౌత్‌ ఎందుకు అన్నారో ఆయనకే తెలుసన్నారు. చివరివరకు తామంతా ఉద్ధవ్‌ ఠాక్రేతోనే ఉంటామని తేల్చి చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తున్నట్టు చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు చేయాల్సినదంతా చేస్తామన్నారు.

మరోవైపు, ఆఖరి క్షణం వరకు ఉద్ధవ్‌ ఠాక్రేకే తమ పూర్తి మద్దతు ఉంటుందని ఎన్సీపీ నేత ఛగన్‌ భుజ్‌బల్‌ స్పష్టంచేశారు. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలెవరూ రాజీనామా చేయలేదు.. ఆ పార్టీ ఎవరినీ బహిష్కరించలేదు గనక తమ ప్రభుత్వానికి తగిన సంఖ్యా బలం ఉందని వ్యాఖ్యానించారు. 

తాజా పరిణామాల నేపథ్యంలో దక్షిణ ముంబయిలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తాజాగా జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో అజిత్ పవార్‌, ఛగన్‌ భుజ్‌బల్‌, జితేంద్ర అవాద్‌, తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ ‘వెయిట్‌ అండ్‌ వాచ్‌’ విధానం

అలాగే, కాంగ్రెస్‌ పార్టీ కూడా అత్యవసరంగా సమావేశమైంది. సహ్యాద్రి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన భేటీలో బాలా సాహెబ్‌ థోరట్‌, నితిన్‌ రౌత్‌, అశోక్‌ చవాన్‌, ఫృథ్వీరాజ్‌ చవాన్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ‘వెయిట్‌ అండ్‌ వాచ్‌’ విధానం కొనసాగించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. శిందే శిబిరం 37 మంది ఎమ్మెల్యేలను నిలుపుకోలేదని, మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం మనుగడసాగిస్తుందని కాంగ్రెస్‌ విశ్వాసం వ్యక్తంచేస్తోంది. శివసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకూ వేచిఉండాలని నిర్ణయించినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని