MNM: కాంగ్రెస్‌లో విలీనమా.. అదేం లేదు: వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయిందన్న కమల్ పార్టీ

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్(Kamal Haasan) పార్టీ వెబ్‌సైట్ హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. 

Published : 28 Jan 2023 11:05 IST

చెన్నై: తమ పార్టీ వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయినట్లు మక్కల్‌ నీది మయ్యమ్‌(MNM) వెల్లడించింది. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్(Kamal Haasan) ప్రారంభించిన ఈ పార్టీ.. కాంగ్రెస్‌(Congress)లో కలిసిపోనుందంటూ ఆ వెబ్‌సైట్‌లో సందేశం దర్శనమిచ్చింది. దీనివల్లే హ్యాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విలీనం సందేశాన్ని ఎంఎన్‌ఎం ఖండించింది. 

‘2024 ఎన్నికల నిమిత్తం జనవరి 30, 2023 నాటికి మక్కల్‌ నీది మయ్యమ్‌ అధికారికంగా కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది’ అని ఓ సందేశం వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది. దీనిపై స్పందించిన పార్టీ.. తమ వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయిందని వెల్లడించింది. అలాగే ప్రస్తుతం సైట్ నిర్వహణ నిమిత్తం దానిని మూసివేసినట్లు వివరించింది. ‘ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేయాలని చూసే మూకలు ఈ హ్యాకింగ్‌కు పాల్పడ్డాయి. దీనిపై మేం తగిన విధంగా స్పందిస్తాం’ అని ట్వీట్ చేసింది. 

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘భారత్‌ జోడో యాత్ర’లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి కమల్‌ హాసన్‌ కలిసి నడిచారు. ఇది రాజకీయాలకు అతీతమైన యాత్ర అని తన మద్దతు ప్రకటించారు. దీంతోపాటు తమిళనాడులోని ఎరోడ్‌ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో హస్తం పార్టీ అభ్యర్థి బరిలో నిలవగా.. కమల్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌(Congress), ఎంఎన్‌ఎం(MNM) కలిసి పనిచేస్తాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉన్న సంగతి తెలిసిందే.

కమల్‌ హాసన్‌(Kamal Haasan) 2018లో ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు, గ్రామాల సాధికారత కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే 2019 లోక్‌సభ, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని