Gujarat: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాజకీయ నేతల్లో ‘పెళ్లిళ్ల’ కలవరం..!

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో చాలా మంది ఓటింగ్‌కు దూరం కావచ్చనే కలవరం అక్కడి రాజకీయ నేతల్లో మొదలయ్యింది.

Published : 08 Nov 2022 14:33 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైన వేళ.. అక్కడి రాజకీయ పార్టీలను మరో ముహూర్తం కలవరపెడుతోంది. నవంబర్‌-డిసెంబర్‌ మధ్యలో భారీ సంఖ్యలో జరగనున్న వివాహాలు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన నాయకుల్లో మొదలైంది. దీంతో ఓటర్లను ఎలాగైనా ఒప్పించి ప్రజాస్వామ్య పండగలో భాగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని గుజరాత్‌ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో గడిచిన రెండు, మూడేళ్లలో వివాహ వేడుకలు సాదాసీదాగానే జరిగాయి. ప్రస్తుతం వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో శుభకార్యాలు, వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో అక్కడి నేతల్లో కలవరం మొదలయ్యింది. శుభ కార్యాల్లో ఓటర్లు బిజీగా ఉండటం, వివాహ వేడుకలకు బంధువులు హాజరు కావడం వంటి అంశాలు.. ఓటింగ్‌పై ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నారు.

గుజరాత్‌లో డిసెంబర్‌ 1, 5వ తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో (నవంబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 14వరకు) వివాహ సీజను మొదలుకానుంది. ముఖ్యంగా నవంబర్‌ 28, 29 తేదీలతోపాటు డిసెంబర్‌ 2, 4, 8 తేదీలు శుభకార్యాలకు అనువైన రోజులు కావడంతో భారీ సంఖ్యలో వివాహాలు జరగనున్నట్లు పండితులు, ఈవెంట్‌ సంస్థలు పేర్కొన్నాయి.

ఇలా వివాహ సీజనులోనే ఎన్నికలు రావడం పోలింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీశ్‌ దోషీ పేర్కొన్నారు. ఎన్నికల కోసం వివాహ తేదీలను మార్చుకోలేరని.. అయినప్పటికీ కొంత సమయం తీసుకొని ఎన్నికల్లో పాల్గొనేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. వేడుకల్లో ఎంత బిజీగా ఉన్నా..  తమ ఇష్టమైన నాయకుడిని గెలిపించేందుకు పౌరులు ముందుకు రావాలని గుజరాత్‌ ఆమ్‌ఆద్మీపార్టీ అధికార ప్రతినిధి కరణ్‌ బరోత్‌ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు దేశవ్యాప్తంగా నవంబరు 4 నుంచి డిసెంబరు 14 మధ్య సుమారు 32 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్లు అఖిల భారత వర్తకుల సమాఖ్య (CAIT) అంచనా వేసింది. కేవలం దిల్లీ ప్రాంతంలోనే 3.5 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. గుజరాత్‌లోనూ భారీ సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని