Congress: రాహుల్‌ మాటే వేదం.. స్వరం మార్చిన రాజస్థాన్‌ సీఎం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పిందే తమకు వేదవాక్కని, ఆయన మాటలను తూచతప్పకుండా ఆచరిస్తామని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అన్నారు.ఇటీవల సచిన్‌ పైలట్‌పై చేసిన ఆరోపణల నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Published : 30 Nov 2022 01:32 IST

జైపూర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పిందే తమకు వేదవాక్కని, ఆయన మాటలను తూ.చ. తప్పకుండా ఆచరిస్తామని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అన్నారు. మధ్యప్రదేశ్‌లో భారత్‌ జోడో యాత్రలో ఉన్న రాహుల్‌ గాంధీని రాజస్థాన్‌ రాజకీయ పరిస్థితులపై సోమవారం విలేకరులు ప్రశ్నించగా.. అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీకి ఆస్తి లాంటివారని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అశోక్‌ గహ్లోత్‌ స్పందిచారు.‘ మేమంతా పార్టీకి ఆస్తిలాంటి వారమని రాహుల్‌ గాంధీ చెబుతున్నారు. కాబట్టి మేమిద్దరం పార్టీకి ముఖ్యమే. అందులో వివాదమేముంది? అదే మా పార్టీ గొప్పతనం.అగ్రనేత చెప్పిన దాన్ని కచ్చితంగా పాటిస్తాం. ఇందులో వివాదాలకు చోటులేదు’ అని జైపూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గహ్లోత్‌ అన్నారు. కేవలం తామిద్దరమే పార్టీకి ఆస్తులు కారని, ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త పార్టీకి ముఖ్యమేనని, వారంతా వెలకట్టలేని ఆస్తి అని తెలిపారు.

ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గహ్లోత్‌ చేసిన వ్యాఖ్యలు రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపాయి. సచిన్‌ పైలట్‌ను ఆయన ‘ద్రోహి’గా సంబోధించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సచిన్‌ పైలట్‌ కూడా తీవ్రస్థాయిలో బదులిచ్చారు. అధికారం కోసం ఇతరులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి తారస్థాయికి చేరినట్లయింది. అయితే, ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం కల్పించుకొని, ఇద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే గహ్లోత్‌ స్వరం మార్చి.. అందరినీ కలుపుతూ పోతున్నట్లు కనిపిస్తోంది.

ఎన్ని వివాదాలున్నా 2023 అసెంబ్లీ ఎన్నికలకే పార్టీ ప్రథమ లక్ష్యమని గహ్లోత్‌ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించి, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని  ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల వల్ల రాష్ట్ర ప్రజలంతా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు అనూహ్య స్పందన వస్తోందని చెప్పారు. వారి అభిమానమే మరోసారి కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెడుతుందని గహ్లోత్‌ తెలిపారు. ప్రతిపక్ష భాజపాపై  స్పందిస్తూ.. పక్కవారిపై విమర్శలు చేయకుండా.. తమ పనేదో చూసుకోవాలని హితవు పలికారు.

గహ్లోత్‌, పైలట్‌ ఒకే వేదికపై..

చాలా రోజుల తర్వాత రాజస్థాన్‌ ముఖ్యమంత్రి గహ్లోత్‌, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ ఒకే వేదికపై కనిపించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరిద్దరూ కలిసి మాట్లాడారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర డిసెంబరు 4 నుంచి రాజస్థాన్‌లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తామిద్దరం కలిసే ఉన్నామన్న సందేశాన్నిచ్చేందుకే ఇలా కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు