West Bengal: బెంగాల్‌లో మోగిన ఉప ఎన్నిక నగారా.. పోటీలో దీదీ 

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం కుర్చీలో కొనసాగేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఉప ఎన్నికకు నగారా మోగింది. భవానీపూర్‌ ఉప

Updated : 04 Sep 2021 15:54 IST

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం కుర్చీలో కొనసాగేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఉప ఎన్నికకు నగారా మోగింది. భవానీపూర్‌ ఉప ఎన్నికతో పాటు మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ ఖరారు చేసింది. దీంతో పాటు ఒడిశాలోని ఒక స్థానానికి కూడా ఎన్నికలు నిర్వహించనుంది. సెప్టెంబరు 30న ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీదీ భవానీపూర్‌ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.

భవానీపూర్‌ ఉప ఎన్నిక సహా శంషేర్‌గంజ్‌, జంగీపూర్‌ అసెంబ్లీ స్థానాలు, ఒడిశాలోని పిప్లీ నియోజకవర్గ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. సెప్టెంబరు 30న ఈ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 13వరకు గడువు కల్పించింది. అక్టోబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించింది. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో తక్షణం ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

బెంగాల్‌ ప్రభుత్వం వినతి మేరకు భవానీపూర్‌తో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానాలకు ఈ నెలలో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. పోలింగ్ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తామని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మరో 31 నియోజకవర్గాల ఉప ఎన్నికలను కరోనా పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసినట్లు తెలిపింది. పండగల తర్వాత వాటికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

బరిలో దీదీ.. గెలుపు తప్పనిసరి..

ఈ ఏడాది ఆరంభంలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తృణమూల్‌ పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. అయితే సీఎం మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్‌లో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. దీదీ సీఎం కుర్చీలో కొనసాగాలంటే ఆరు నెలల్లోగా మళ్లీ అసెంబ్లీకి ఎన్నికవ్వాలి. ఇదిలా ఉండగా.. ఎన్నికలు జరిగిన కొన్ని రోజులకే భవానీపూర్ స్థానానికి తృణమూల్‌ నేత సోభాందేవ్‌ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. దీంతో దీదీ ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మమతా బెనర్జీ సీఎంగా కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో తప్పక గెలవాల్సిన అవసరం ఉంది. ఇక భవానీపూర్‌ నుంచి గతంలో ఆమె రెండు సార్లు విజయఢంకా మోగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని