బెంగాల్‌ పోరు: ఏడో దశలోనూ అదే జోరు!

పశ్చిమ బెంగాల్‌లో నేడు ఏడో విడతలో భాగంగా 34 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 75శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

Published : 27 Apr 2021 00:51 IST

ఓటు హక్కు వినియోగించుకున్న మమతా బెనర్జీ

కోల్‌కతా: ఓవైపు కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అదే జోరు కొనసాగింది. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు కొవిడ్‌ ఉద్ధృతి నడుమ బెంగాల్‌లో ఏడో విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఈ విడతలో 34 శాసనసభ స్థానాలకు జరగ్గా.. సాయంత్రం వరకు 75శాతం పోలింగ్‌ నమోదైంది.

పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకుగానూ మొత్తం ఎనిమిది విడతల్లో పోలింగ్‌ జరుగుతోంది. నేడు (ఏప్రిల్‌ 26) జరిగిన ఏడో విడతలో భాగంగా ఐదు జిల్లాల పరిధిలో ఉన్న 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ పూర్తయ్యింది. సాయంత్రం 7గంటల వరకు అక్కడ 75.06శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాణినగర్‌ నియోజక వర్గంలో అత్యధికంగా 84శాతం పోలింగ్‌ నమోదుకాగా, ముర్షీదాబాద్‌, భాగబంగోలా స్థానాల్లో 83శాతం పోలింగ్‌ రికార్డయ్యింది. కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో ఓటర్లు వైరస్‌ బారిన పడకుండా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక కొవిడ్‌ సోకిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు పోలింగ్‌ చివరి గంట వారికి కేటాయించారు. దీంతో పలు కేంద్రాల్లో పీపీఈ కిట్లతో వచ్చిన రోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ దశలో మొత్తం 284 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

ఓటు వేసిన మమతా బెనర్జీ..

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోల్‌కతాలోని భవానీపోర్‌లో ఉన్న పోలింగ్‌ బూత్‌లో మమతా బెనర్జీ ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత విజయ సంకేతాన్ని చూపుకుంటూ బయటకు వచ్చారు. గత ఎన్నికల్లో భవానీపోర్‌ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ, ఈసారి నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే, ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్లో ఏడు విడతల్లో మొత్తం 259 స్థానాల్లో పోలింగ్‌ పూర్తయ్యింది. ఇక ఏప్రిల్‌ 29న జరిగే చివరి విడతలో 35 స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. మే 2 వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని