Chandrababu: తెదేపా అన్‌స్టాపబుల్‌.. అడ్డొస్తే తొక్కుకొని వెళ్తాం: చంద్రబాబు

రానున్న నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో  ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశముందని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెదేపా అన్‌స్టాపబుల్‌ అని, అడ్డొస్తే తొక్కుకొని వెళ్తామని అన్నారు.

Updated : 24 Mar 2023 19:29 IST

అమరావతి: వైకాపా ఎమ్మెల్యేలకు జగన్‌పై నమ్మకం లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ.. అన్‌స్టాపబుల్‌ అని, గేర్‌ మార్చి.. స్పీడ్‌ పెంచుతామని తెలిపారు. ‘సైకిల్‌పై దూసుకెళ్తాం.. అడ్డొస్తే తొక్కుకొని వెళ్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చేసిన విధ్వంసం వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న చంద్రబాబు.. అప్పులు చేయడం, దోచుకోవడమే జగన్‌ పని అని దుయ్యబట్టారు. చాలా మంది వైకాపా ఎమ్మెల్యేల్లో గుసగుసలు మొదలయ్యాయని చెప్పారు. ఇకపై వైకాపా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, అధికార పార్టీ మరిన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన తెదేపా జోన్‌-3 సమావేశంలో ఆయన మాట్లాడారు.  జగన్‌ది ధన బలమైతే.. తెదేపాది జనబలమని అన్నారు. పేదలను దోచుకున్న జగన్.. పేదల ప్రతినిధిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో అందరి ముఖ్యమంత్రులకున్న ఆస్తి కంటే జగన్ ఆస్తి ఎక్కువని చంద్రబాబు ఆరోపించారు. పట్టభద్రుల్లో తిరుగుబాటు వచ్చిందని, దాని ఫలితమే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలనీ అన్నారు.

కార్యకర్తలకు సమయం ఇవ్వలేకపోయా

వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు స్పష్టం చేశారు. కష్టపడ్డ కార్యకర్తలను వెతుక్కుంటూ పార్టీనే వాళ్ల వద్దకు వస్తుందని, వచ్చే ప్రభుత్వంలో పైరవీలు ఉండవని తేల్చి చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారే తన ఆప్తులని, వారికే ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు వెల్లడించారు.  రాష్ట్రాన్ని బాగుచేయడం ఎంత ముఖ్యమో, తెలుగుదేశం కుటుంబ సభ్యులను బాగుచేయడం అంతే ముఖ్యమని ఉద్ఘాటించారు. గతంలో తాను కార్యకర్తలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయిన మాట వాస్తవమేనన్న చంద్రబాబు.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉండిపోయానన్నారు.  ఈసారి కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని, ఎన్ని పనులున్నా కార్యకర్తలే ముఖ్యమని చెప్పారు.

క్లీన్‌ స్వీప్‌ ఖాయం

తెదేపా బలపడింది కాబట్టి... జగన్‌ నవంబరులోనో, డిసెంబరులోనూ ఎన్నికలకు వెళ్లొచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. అధికారంలోకి వచ్చాక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మంత్రిని నియమిస్తామని చెప్పారు. గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంతలో పశువుల మాదిరిగా తెలుగుదేశం ఎమ్మెల్యేలను వైకాపా కొనుగోలు చేసిందని మండిపడ్డారు. ఈ ఏడాది మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్కసారి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌కు ఇదే చివరిసారి కావాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని