Sajjala Ramakrishna Reddy: సామాన్యులకు రాష్ట్ర సచివాలయంతో ఏం పని?: సజ్జల

‘సామాన్యులకు రాష్ట్ర సచివాలయంతో పనేంటి? గ్రామస్థాయిలో సచివాలయాలు ఏర్పాటుచేశాక స్థానికంగానే సమస్యలు పరిష్కారమవుతున్నాయి.

Updated : 15 Oct 2022 07:10 IST

గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కారం

చుండూరు, న్యూస్‌టుడే: ‘సామాన్యులకు రాష్ట్ర సచివాలయంతో పనేంటి? గ్రామస్థాయిలో సచివాలయాలు ఏర్పాటుచేశాక స్థానికంగానే సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిపాలనా రాజధాని విశాఖకు మార్చాలని వైకాపా ప్రభుత్వం భావించింది’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరులో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్నందున భాజపా, దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్‌కు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. లోగడ ఆయనే సరైన పాలన అందిస్తే 2019లో ప్రజలు చిత్తుగా ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. ఆరునూరైనా మూడు ప్రాంతాల్లోనూ రాజధానులను ఏర్పాటుచేస్తామని సమావేశంలో పాల్గొన్న మంత్రి నాగార్జున స్పష్టం చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ కూడా హాజరయ్యారు.

రోడ్డుకు అడ్డంగా సభావేదిక
సభ కోసం స్థానిక నాయకులు తెనాలి-చుండూరు ప్రధాన రహదారిలో వలివేరు వద్ద రోడ్డుకు అడ్డంగా వేదిక ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకే వేదిక సిద్ధం చేసి సాయంత్రం సభ పూర్తయ్యేవరకు ఉంచేశారు. దీంతో ఐదు గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఆటోలు, ద్విచక్రవాహనాల్లో ప్రయాణించేవారు అంతర్గత రోడ్లను ఆశ్రయించాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని