Karnataka Results: కాంగ్రెస్ అఖండ విజయంతో.. ప్రేమ దుకాణాలు తెరుచుకున్నాయ్..!

Karnataka Election Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. దీనిపై పలు పార్టీలకు చెందిన నేతలు స్పందించారు. 

Published : 13 May 2023 19:05 IST

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్(Congress) పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ గెలుపుతో హస్తం పార్టీ కార్యాలయాల్లో పండగవాతావరణం నెలకొంది. ఈ భారీ మెజార్టీపై పార్టీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. విద్వేష మార్కెట్లు మూతపడ్డాయని, ప్రేమ దుకాణాలు తెరుచుకున్నాయని రాహుల్ గాంధీ(Rahul Gandhi) వ్యాఖ్యానించారు. ‘ఈ సందర్భంగా కర్ణాటక ప్రజలు, నేతలకు అభినందనలు తెలియజేస్తున్నాను. విద్వేష ప్రసంగాలు చేయకుండా ఈ ఎన్నికల్లో పోటీ చేసినందుకు మాకు సంతోషంగా ఉంది. మేం ప్రేమతో పోరాడాం’అని అన్నారు. మరోపక్క భాజపా నేతలు తమ పార్టీ ఓటమిపై స్పందించారు. (Karnataka Election Results 2023)

  • చరిత్రాత్మక విజయం అందించిన కన్నడ ప్రజలకు కృతజ్ఞతలు. ఇది కర్ణాటక అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన విజయం. ఇది భారత్‌ను ఏకం చేసేందుకు లభించిన విజయం. మీ కఠోర శ్రమ గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ నిర్విరామంగా పనిచేస్తుంది. జై కాంగ్రెస్‌... కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ
  • క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించి స్థానిక సమస్యలపై స్పందించి, నిబద్ధతతో పనిచేసిన కాంగ్రెస్ సహచరుల పట్ల గర్వంగా ఉంది. అయితే ఇది వేడుకలు చేసుకునే సమయమే కానీ ఉదాసీనంగా వ్యవహరించే వేళ కాదు... కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌
  • కర్ణాటకలో అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్‌కు అభినందనలు. ఏ మాత్రం సమర్థనీయం కాని రీతిలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం, ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం, బలవంతంగా హిందీని రుద్దడం, వేళ్లానుకుపోయిన అవినీతి.. ఓటువేసేప్పుడు కర్ణాటక ప్రజల మనసుల్లో ప్రతిధ్వనించింది. అందుకే వారు ప్రతీకార రాజకీయాలకు గట్టి బదులిచ్చి, కర్ణాటకను గర్వంగా నిలబెట్టారు... తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ 
  • అద్భుత విజయం సొంతం చేసుకున్న రాహుల్‌ గాంధీకి నా అభినందనలు.  గాంధీజీ వలె ప్రజల హృదయాల్లో చోటు సంపాదించారు. ప్రేమతో, సౌమ్యమైన మార్గంలో అధికార పీఠాలను కదిలించగలరని నిరూపించారు. మీ విజయానికి, విజయం సాధించిన తీరుకు ధన్యవాదాలు... మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్‌ హాసన్‌
  • కర్ణాటక నుంచి వచ్చిన సందేశం భాజపా అనుసరిస్తోన్న అవినీతి, మహిళా వ్యతిరేక, ధనిక అనుకూల, విభజన, దుష్ప్రచార రాజకీయాలకు ముగింపు... ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్
  • భాజపాకు గెలుపోటములు కొత్తకాదు. ఈ ఫలితాల్లో కార్యకర్తలు ఆందోళనకు గురికావాల్సిన ఆవసరం లేదు. ఓటమికి గల కారణాలపై దృష్టిసారిస్తాం. ఈ ప్రజాతీర్పును సగౌరవంగా అంగీకరిస్తున్నాను... భాజపా నేత బీఎస్‌ యడియూరప్ప 
  • ప్రధాని మోదీ సహా భాజపా నేతలు ఎంతగానో కృషి చేసినప్పటికీ.. మేం మెజార్టీ మార్కును అందుకోలేకపోయాం. ఈ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నా... కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని