Sukhvinder Singh: హిమాచల్‌ సీఎంగా సుఖ్వీందర్‌ సింగ్‌నే ఎందుకు?

దాదాపు నాలుగు దశాబ్దాలపాటు పార్టీకి అనుంగుడిగా ఉన్న సుఖ్వీందర్‌ సింగ్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ఎంపిక చేసింది. అయితే, ఆయన్నే సీఎంగా ఎన్నుకోవడానికి కారణాలేంటి?

Published : 11 Dec 2022 01:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు నాలుగు దశాబ్దాలపాటు పార్టీకి అనుంగునిగా ఉన్న సుఖ్వీందర్‌ సింగ్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసింది. పార్టీలో వివిధ బాధ్యతలను నిర్వర్తించిన సుఖ్వీందర్‌.. సీఎంగా ఎంపికయ్యేందుకు దోహదం చేసిన అంశాలను ఓ సారి పరిశీలిస్తే..

  • హిమాచల్‌ ప్రదేశ్‌లోని మొత్తం 68 స్థానాలకుగానూ తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ 40 స్థానాలను కైవసం చేసుకుంది. అందులో సగానికి పైగా ఎమ్మెల్యేలు సుఖ్వీందర్‌ సింగ్‌ నాయకత్వానికి జై కొట్టారు.
  • ముఖ్యమంత్రి పదవి ఆశించిన ప్రతిభాసింగ్‌గానీ, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఎన్నికైన ముకేశ్‌ అగ్నిహోత్రిగానీ మాజీ సీఎం వీరభద్రసింగ్ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ, సుఖ్వీందర్‌ సింగ్‌ మాత్రం విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
  • సుఖ్వీందర్‌ సింగ్‌ అందరికీ సుపరచితుడు. వీరభద్రసింగ్‌ సీఎంగా ఉన్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో కీలకంగా పని చేశారు. పార్టీలో చాలా మంది ఈయన నిర్ణయాలకు మద్దతు తెలుపుతుంటారు. 
  • దాదాపు 4 దశాబ్దాల తన రాజకీయ ప్రస్థానంలో సుఖ్వీందర్‌ సింగ్‌ పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. విద్యార్థి నాయకుడి నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు అధిష్ఠానం అప్పగించిన పలు బాధ్యతలు నిర్వర్తించారు.
  •  వర్సిటీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నందువల్లే సుఖ్వీందర్‌ సింగ్‌ను ఫైర్‌బ్రాండ్‌ అని కూడా పేరుంది. పార్టీ అంతర్గత విషయాల్లోనూ తొందరపడకుండా సమయానుకూలంగా వ్యవహరిస్తారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కూడా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ.
  • కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సన్నిహితుడు కావడం సుఖ్వీందర్‌కు కలిసొచ్చిన మరో అంశం. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేసులో నిలిచిన ప్రతిభా సింగ్‌కంటే వయస్సులో చిన్నవాడు కావడం కూడా ఆయనకు ప్లస్‌పాయింట్‌ అయ్యింది.
  • ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హిమాచల్‌లో 10 ర్యాలీలు నిర్వహించారు. వీటన్నింటినీ సుఖ్వీందర్‌ సింగ్ వెన్నంటి ఉండే నడిపించారు. కానీ, పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న ప్రతిభాసింగ్‌ మాత్రం ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఇది కూడా సుఖ్వీందర్‌కు అనుకూలంగా మారింది.
  • పార్టీలో కొత్తవారికి చోటు లభించడంలేదనే అపోహలు తొలగించాలని కాంగ్రెస్‌ భావించడం కూడా సుఖ్వీందర్‌కు కలిసొచ్చింది. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్‌.. తాము గెలిచిన చోటనైనా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావించింది. ఇది కూడా సుఖ్వీందర్‌ను సీఎంగా ఎంపిక చేయడానికి కారణం కావొచ్చని భావిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని