త్రిపురలో ఏం జరుగుతోంది..?

త్రిపురలో వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన భాజపా ప్రభుత్వంలో ముసలం మొదలైంది. సీఎం విప్లవ్‌ కుమార్‌ దేవ్‌వ్యవహారశైలిని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన........

Updated : 23 Feb 2024 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్రిపురలో వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి వచ్చిన భాజపా ప్రభుత్వంలో ముసలం మొదలైంది. సీఎం విప్లవ్‌ కుమార్‌ దేవ్‌వ్యవహారశైలిని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు దిల్లీ చేరడంతో ఆ రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. మరి కొంతమంది సైతం విప్లవ్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని తిరుగుబాటు నేతల ప్రకటనలు.. విప్లవ్‌ సీటుకు ఎసరు తీసుకొచ్చే పరిస్థితి నెలకొందని సంకేతాలిస్తున్నాయి.

త్రిపురలో విప్లవ్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఆరోగ్యమంత్రి సుదీప్‌ రాయ్‌ బర్మన్‌ నేతృత్వంలోని 12 మంది ఎమ్మెల్యేలు దిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలో పాలన అంతంత మాత్రంగానే ఉందని, ప్రజలకిచ్చిన హామీలు నెరవేరడం లేదని ఈ బృందం చెబుతోంది. ఇలాగైతే 2023లో మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనని తిరుగుబాటు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళదామనే తాము దిల్లీ చేరుకున్నామని చెబుతున్నప్పటికీ.. వీరంతా విప్లవ్‌ నాయకత్వాన్ని మార్చాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం ఆయన బిహార్‌ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్న నేపథ్యంలో ఆయనను ఎలాగైనా కలిసేందుకు హస్తినలోనే మకాం వేశారు. ప్రధాని మోదీ, అమిత్‌షాను సైతం కలిసే యోచనలో ఉన్నారు.

ఎందుకు వ్యతిరేకత..?

ప్రస్తుతం దిల్లీ చేరుకున్న అసంతృప్త ఎమ్మెల్యేలంతా విప్లవ్‌దేవ్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలో పార్టీ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చడం లేదని చెబుతున్నారు. దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఒక్కోసారి ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి చేటు తెచ్చేలా ఉంటున్నాయని చెబుతున్నారు. అయితే, ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న సుదీప్‌ రాయ్‌ బర్మన్‌ గతంలో తృణమూల్‌ నుంచి భాజపాలో చేరారు. భాజపా ప్రభుత్వం కొలువుదీరగానే ఆయనను వైద్యారోగ్యమంత్రిగా నియమించారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంగా ఆయన మంత్రి పదవి నుంచి గతేడాది తప్పించారు. ఆ పదవిని సీఎం తనవద్దే అట్టిపెట్టుకున్నారు. వివాదానికి ఇదో కారణమని తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి తొలగించడంతో సుదీప్‌.. బహిరంగంగానే కరోనా నియంత్రణ విషయంలో వైద్యారోగ్యశాఖ తీరును తప్పుబట్టారు. ఈ క్రమలో అనధికారికంగా కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని సందర్శించారన్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేశారు. దీనికి తోడు ఆ రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చూసే రామ్‌ మాధవ్‌ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించడం పార్టీ వ్యవహారాలు చూసే పెద్ద దిక్కు లేకపోవడం ఈ వ్యవహారం దిల్లీ చేరింది.

విప్లవ్‌కు ముప్పేనా..?
60 స్థానాలున్న త్రిపురలో భాజపాకు 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇండిజినస్‌ పీపుల్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)కి చెందిన మరో 8 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. సీపీఎంకు 16 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే, విప్లవ్‌ నాయకత్వంపై సుమారు 25 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని ఈ బృందం చెబుతోంది. వీరు చెబుతున్నట్లు వీరంతా విప్లవ్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే విప్లవ్‌కు కష్టమనే చెప్పాలి. మరి భాజపా కేంద్ర నాయకత్వం ఏ తీరున స్పందిస్తుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని