ఎన్డీయేలో ఇంకా ఏం మిగిలింది: శివసేన

ఎన్డీయే నుంచి అకాళీ దళ్‌ నిష్క్రమించిన తర్వాత ఆ కూటమిలో ఏం మిగిలిందంటూ శివసేన ఎద్దేవా చేసింది. ఆ సంకీర్ణంలో ఇంకా ఏ పార్టీలు మిగిలి ఉన్నాయని ప్రశ్నించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నాలో సోమవారం సంపాదకీయం ప్రచురించింది.............

Updated : 28 Sep 2020 19:20 IST

ముంబయి: ఎన్డీయే నుంచి శిరోమణి అకాళీ దళ్‌ నిష్క్రమించిన తర్వాత ఆ కూటమిలో ఏం మిగిలిందంటూ శివసేన ఎద్దేవా చేసింది. ఆ సంకీర్ణంలో ఇంకా ఏ పార్టీలు మిగిలి ఉన్నాయని ప్రశ్నించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నాలో సోమవారం సంపాదకీయం ప్రచురించింది. ఎన్డీయే మూల స్తంభాల్లో ఒకటైన అకాళీదళ్‌ వెళ్లిపోవడాన్ని కూడా భాజపా నిలువరించలేకపోయిందని విమర్శించింది. 

‘‘బాదల్‌లు కూటమి నుంచి నిష్క్రమిస్తుంటే వారిని ఆపే ప్రయత్నమే జరగలేదు. అంతకుముందు శివసేన వైదొలిగింది. మూలస్తంభాల్లాంటి ఈ రెండు పార్టీలు వెళ్లిపోయిన తర్వాత ఎన్‌డీయేలో ఇంకా ఏం ఉంది. ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలకు హిందూత్వ సిద్ధాంతంతో ఏమైనా సంబంధం ఉందా? కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఎన్డీయే ఏర్పడింది. తదనంతర కాలంలో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంది. కొన్ని పార్టీలు వారి అవసరాలకనుగుణంగా మధ్యలోనే విడిపోయారు. దేశంలో ఏకపార్టీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. కానీ, వివిధ రాష్ట్రాల్లో భాజపా అక్కడి ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టాల్సి వస్తుంది’’ అని వ్యాసంలో శివసేన అభిప్రాయపడింది. 

వ్యవసాయ రంగ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ తొలుత ప్రభుత్వం నుంచి ఆపై ఎన్డీయే కూటమి నుంచి అకాళీదళ్‌ వైదొలిగిన విషయం తెలిసిందే. అంతకుముందు గత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో విభేదాలు తలెత్తడంతో శివసేన సైతం కూటమిని వీడింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు తెలుగుదేశం పార్టీ సైతం ఎన్డీయేకు దూరమైన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు