Congress Presidential Elections: ఆ ముగ్గురూ.. ఎవరికి వారే పోటీ: మధుసూదన్‌ మిస్త్రీ

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులు ఎవరికి వారే పోటీ చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎన్నికల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌ మిస్త్రీ అన్నారు. ఎవరికీ ప్రత్యేకంగా గాంధీ కుటుంబ సభ్యుల మద్దతు లేదన్నారు.

Published : 01 Oct 2022 02:24 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో ఒక అంకం ముగిసింది. నామినేషన్ల గడువు తీరిపోయింది. ఇప్పటివరకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు సమర్పించినట్లు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ మిస్త్రీ అధికారికంగా వెల్లడించారు. తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కే ఎన్‌ త్రిపాఠి నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ముగ్గురూ ఎవరికి వారే బరిలోకి దిగుతున్నారని, గాంధీ కుటుంబం ఎవరికీ మద్దతు తెలపడం లేదని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 9,100 మందికిపైగా నేతలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 8 వరకు గడువు ఉంది. అక్టోబరు 17న ఎన్నికలు నిర్వహించి..19న ఫలితాలు వెల్లడించనున్నారు.

పార్టీలో అంతర్గత మార్పులు అనివార్యమంటూ గతంలో అధినేత్రి సోనియాకు లేఖలు రాసిన జీ 23 నేతల్లో ఒకరైన శశి థరూర్‌ 5 సెట్ల నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. త్రిపాఠి ఒకసెట్‌ పత్రాలను మాత్రమే దాఖలు చేశారు. సీనియర్‌ నేతల మద్దతున్న మల్లిఖార్జున ఖర్గే మాత్రం తనను బలపరిచిన ఆనంద్ శర్మ, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, మనీశ్‌ తివారీ పేర్లను జత చేస్తూ నామినేషన్‌ దాఖలు చేశారు. వీరంతా జీ 23 నేతలు కావడం గమనార్హం. దీంతో పార్టీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గేకే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని