Isudan Gadhvi: గుజరాత్ ‘నాయక్‌’ అవుతారా? ఎవరీ ఇసుదాన్‌ గఢ్వీ?

గుజరాత్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదాన్‌ గఢ్వీ పేరును ప్రకటించింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. మాజీ యాంకర్‌గా, జర్నలిస్టుగా రాష్ట్రంలో విశేషాదరణ పొందిన గఢ్వీ నేతృత్వంలో ఆప్‌ ఎన్నికలకు వెళ్తోంది. ఈ సందర్భంగా ఆయన గురించి విశేషాలు తెలుసుకుందాం.

Updated : 04 Nov 2022 17:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘ఈయన కేవలం ముఖ్యమంత్రి అభ్యర్థి మాత్రమే కాదు.. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కూడా’’.. గుజరాత్‌ సీఎం అభ్యర్థి ప్రకటన సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పిన మాటలివి. గుజరాత్‌లో ఆప్‌ సీఎం అభ్యర్థిగా ఇసుదాన్‌ గఢ్వీ పేరును కేజ్రీవాల్‌ శనివారం ప్రకటించారు. మాజీ టీవీ యాంకర్‌ అయిన గఢ్వీ.. జర్నలిస్టుగా ఎంతో పాపులారిటీ సాధించారు. ఏడాది క్రితమే ఆప్‌లో చేరి జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు.

జర్నలిస్టుగా కెరీర్‌ను మొదలుపెట్టి..

40 ఏళ్ల గఢ్వీ.. గుజరాత్‌లోని ద్వారక జిల్లా పిపాలియా గ్రామంలో ఉన్నత రైతు కుటుంబంలో జన్మించారు. జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్‌ చేసిన ఆయన.. దూరదర్శన్‌లో ‘యోజన’ అనే కార్యక్రమంతో కెరీర్‌ మొదలుపెట్టారు. 2007 నుంచి 2011 వరకు ఈటీవీ గుజరాతీ ఛానల్‌లో ఆన్‌ఫీల్డ్‌ జర్నలిస్టుగా పనిచేశారు. ఆ సమయంలో దాంగ్‌, కపరాడా తాలూకాల్లో అక్రమ అటవీ నిర్మూలన కుంభకోణాలను బయటపెట్టారు. గఢ్వీ కథనాలతోనే అప్పటి గుజరాత్‌ ప్రభుత్వం ఈ కుంభకోణాలపై చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలతో గఢ్వీ పేరు రాష్ట్రమంతటా మార్మోగింది.

ఆ తర్వాత 2015లో గఢ్వీ.. వీటీవీ గుజరాతీ ఛానల్‌లో చేరి ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2021 వరకు అక్కడే పనిచేసిన ఆయన ప్రముఖ ప్రైమ్‌ టైమ్‌ టీవీ షో ‘మహామంథన్‌’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అనేక అంశాలపై ఆయన ప్రముఖులు, ప్రజలతో చర్చావేదికలు నిర్వహించారు. ఈ షో ఆయనకు విశేషాదరణ తెచ్చిపెట్టింది. లక్షలాది మంది వీక్షించే ఆ షో సమయం రాత్రి 8-9 గంటలు కాగా.. ప్రజల డిమాండ్‌ మేరకు చాలా సార్లు దాన్ని రాత్రి 9.30 గంటల వరకు పొడిగించారట.

ఏడాది క్రితమే రాజకీయాల్లోకి..

యాంకర్‌గా, జర్నలిస్టుగా విశేష ప్రజాదరణ పొందిన గఢ్వీ ఏడాది క్రితమే న్యూస్‌ మీడియాను వీడి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2021 జూన్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ అహ్మదాబాద్‌లో ఆప్‌ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇదే వేదికపై గఢ్వీ.. ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ తర్వాత పార్టీలో క్రమక్రమంగా ఎదిగారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం.. ప్రజల్లో ఉన్న పేరు కారణంగా ఈ ఏడాది జూన్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆయనను జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పార్టీ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌లోనూ గఢ్వీ సభ్యుడిగా ఉన్నారు. గతేడాది గుజరాత్‌లో ఓ ప్రభుత్వ నియామక పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌ అయిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. ఆ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు పలువురు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలను అరెస్టు చేసి జైలుకు పంపించారు. వీరిలో గఢ్వీ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. గఢ్వీ ఓబీసీ నేత. గుజరాత్‌లో 48శాతం ఈ సామాజిక వర్గానికి చెందినవారే.

ప్రజలకు న్యాయం అందించడం, సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పే గఢ్వీ.. తనను తాను ‘నాయక్‌’గా అభివర్ణించుకుంటారు. మరి జర్నలిస్టుగా ఎంతో పాపులారిటీ సాధించిన ఆయన.. ఇప్పుడు గుజరాత్‌కు ‘నాయక్‌’ అవుతారా? ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరో విజయాన్ని అందిస్తారా? అంటే ఎన్నికల దాకా ఆగాల్సిందే..!

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts