Rivaba Jadeja: జడేజా భార్యగానే కాదు.. పాలిటిక్స్‌లో ముందు నుంచీ యాక్టివ్‌! (10 పాయింట్స్‌)

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Assembly polls)ల్లో మరోసారి రికార్డు విజయం సాధించాలన్న కసితో ఉన్న భాజపా సుదీర్ఘ కసరత్తు అనంతరం 160 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.  క్రికెటర్‌ రవీంద్రసిన్హా జడేజా భార్య రివాబా జడేజాను జామ్‌నగర్‌ నార్త్‌ నుంచి బరిలో దించుతోంది.

Published : 11 Nov 2022 01:10 IST

దిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly polls) కోలాహలం కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో మరోసారి రికార్డు విజయం సాధించాలన్న కసితో ఉన్న భాజపా సుదీర్ఘ కసరత్తు అనంతరం 160 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. సీఎం భూపేంద్ర పటేల్‌ ఘాట్‌లోడియా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్టు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ ప్రకటించారు. అలాగే, ఈసారి 75ఏళ్లు దాటిన నేతలను పక్కనబెట్టి యువతకు అవకాశం కల్పించాలని భావించిన కమలనాథులు.. క్రికెటర్‌ రవీంద్రసిన్హా జడేజా భార్య రివాబా జడేజాకు టిక్కెట్‌ ఇచ్చారు. జడేజా భార్యగానే కాకుండా గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటోన్న 32 ఏళ్ల రివాబా జామ్‌నగర్‌ నార్త్‌ నుంచి తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆమె గురించి కొన్ని విశేషాలివే..

  1. రివాబా జడేజా 1990లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు హర్‌దేవ్‌ సింగ్‌ సోలంకి, ప్రఫుల్లాబా సోలంకి. క్రికెటర్‌ రవీంద్ర జడేజాతో వివాహానికి ముందు ఆమెను అందరూ రివా సోలంకి అని పిలిచేవారు.
  2. రాజ్‌కోట్‌లోని ఆత్మియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 32ఏళ్లు.
  3. 2019లో భాజపాలో చేరి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రివాబా.. గత కొన్నేళ్లుగా భాజపా తరఫున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన ఆమె కమలదళంలో చేరడానికి ముందు 2018లో కర్ణిసేన మహిళా విభాగానికి చీఫ్‌గా నియమితులయ్యారు. 
  4. భారత్‌ ఆల్‌రౌండర్‌గా పేరొందిన రవీంద్ర జడేజాతో పరిచయం కాకముందు అతడి సోదరి నైనా, రివాబా మంచి స్నేహితులు. ఆ తర్వాత ఓ పార్టీలో జడేజాను కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ డేటింగ్ మొదలుపెట్టారు.
  5. 2016 ఫిబ్రవరి 5న ఈ ప్రేమ జంటకు నిశ్చితార్థం జరగ్గా.. అదే ఏడాది ఏప్రిల్‌ 17న వివాహ బంధంతో రవీంద్ర జడేజా- రివాబా ఒక్కటయ్యారు. 
  6. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హరిసింగ్‌ సోలంకికి ఈమె మేనకోడలు. 
  7. గత రెండేళ్లలో ఆమె జామ్‌నగర్‌ జిల్లాలో దాదాపు 135 గ్రామాలను సందర్శించారట. 
  8. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఆమెకు ఫేస్‌బుక్‌లో 6.77లక్షల మంది, ఇన్‌స్టాలో 8,385 మంది ఫాలోవర్లు ఉన్నారు.
  9. జామ్‌నగర్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన రివాబా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. బాలికల  సంక్షేమం, విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపైనా అవగాహన కల్పిస్తున్నారు.
  10. తాను స్థాపించిన శ్రీ మాతృశక్తి చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అవసరమైన సేవలను అందిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని