బెంగాల్‌లో దీదీ హ్యాట్రికా? కమల వికాసమా? 

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగబోయే ఎన్నికలు మినీ సమరాన్ని తలపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో యావత్‌ దేశం చూపంతా ముఖ్యంగా బెంగాల్‌ వైపే ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌- లెఫ్ట్‌- ఐఎస్‌ఎఫ్‌ కలిసి కూటమి.......

Updated : 23 Mar 2021 19:07 IST

గెలుపోటములను నిర్ణయించే ఐదు కీలకాంశాలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగబోయే ఎన్నికలు మినీ సార్వత్రిక ఎన్నికల సమరాన్ని తలపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో యావత్‌ దేశం చూపంతా ముఖ్యంగా బెంగాల్‌ వైపే ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌- లెఫ్ట్‌- ఐఎస్‌ఎఫ్‌ కలిసి కూటమి పోటీచేస్తున్నప్పటికీ  తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్యే బిగ్‌ ఫైట్‌ కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచే ఇరు పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధమే ఇందుకు నిదర్శనం. బెంగాల్‌లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని భాజపా.. కమలనాథుల దూకుడుకు కళ్లెం వేయాలని దీదీ పట్టుదలతో ఉన్నారు. ఈ ఉత్కంఠ పోరులో గెలిచేదెవరు? ఓడేదెవరు? గెలుపోటముల్ని ప్రభావితం చేసే అంశాలేమిటి? ఇప్పుడు చర్చంతా ఇదే..!

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలూ వ్యూహ ప్రతివ్యూహాలతో తమ సర్వశక్తుల్ని ఒడ్డుతున్నాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని మమత ప్రయత్నిస్తుండగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి బెంగాల్‌లో వచ్చిన ఓటింగ్‌ను దృష్టిలో పెట్టుకొని విజయం తమదేనంటూ దూకుడుగా దూసుకెళ్తోంది భాజపా. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా తదితర నేతలంతా స్వయంగా రంగంలోకి దిగి ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమై ఎనిమిది విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌) కలిసి పోటీచేయడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. మరోవైపు, బెంగాల్‌లో ఎన్నికలను తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తృణమూల్‌ గెలిస్తే దీదీ హ్యాట్రిక్‌ సీఎం అవుతారు. భాజపా గెలిస్తే మరో పెద్ద రాష్ట్రం తమ ఖాతాలో చేరడంతో పాటు ఇదో అపూర్వ విజయమై పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ నింపుతుంది. అందుకే, తృణమూల్‌, భాజపా రెండూ ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టోలను రూపొందించాయి. తమకు కలిసొచ్చే ఓటర్లు ఎవరో గుర్తించి తద్వారా ఆయా వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఐదు అంశాలే గెలుపోటమిల్లో కీలకం కానున్నాయి. 

సైలెంట్‌ ఓటర్లే నిర్ణేతలు!
సైలెంట్‌ ఓటర్లుగా పిలవబడుతున్న మహిళా ఓటర్లది బెంగాల్‌ ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర కానుంది. మొత్తం జనాభాలో వీరు 49శాతంగా ఉన్నారు. వీరిని ఆకట్టుకొనేందుకు రెండు పార్టీలూ పోటీపడి హామీలు గుప్పించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు, ప్రభుత్వ రవాణా సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని భాజపా హామీ ఇచ్చింది. మరోవైపు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏకంగా 50మంది మహిళల్ని అభ్యర్థుల్ని (మొత్తం అభ్యర్థుల్లో 17%) ఎన్నికల బరిలో దించింది. మహిళా ఓటర్లకు అనుకూలంగా ఉండే పార్టీకి ఈ ఎన్నికల్లో మంచి ఫలితం వస్తుందనడంలో సందేహం అవసరంలేదు. 

మధ్యతరగతి దారెటు? 
బెంగాల్‌లో మధ్యతరగతి ఓటర్లు ఈసారి ఎటువైపు ఉంటారోనన్న ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికల తర్వాత వీరంతా భాజపా, ప్రధాని నరేంద్ర మోదీపై విశ్వాసం చూపారని అప్పటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో రుజువైంది. ప్రస్తుతం ఇంధన ధరలు, ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మండిపోవడం ఓ సమస్యగా మారింది. ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తి వారి మద్దతును కూడగట్టేందుకు దీదీ తీవ్రంగానే ప్రయత్నించారు. పెట్రో ధరల పెరుగులను నిరసిస్తూ స్కూటర్‌పై ప్రయాణం చేసి ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం కూడా చేశారు.  తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామంటూ హామీ ఇవ్వడం గమనార్హం. ఈ అస్త్రం మధ్య తరగతి ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి మరి! 

నిరుద్యోగంపై పోటాపోటీ  హామీలు

బెంగాల్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ప్రతిభావంతులు బయటకు వెళ్లిపోతున్నారంటూ భాజపా పదే పదే టార్గెట్‌ చేస్తోంది. నిరుద్యోగ సమస్య మమతకు ప్రతికూల ప్రభావం చూపి తమకు లాభం చేకూరుస్తోందని భావిస్తోంది. అయితే, మమత మాత్రం ఏటా 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో భాజపా మరో అడుగుముందుకేసి ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉపాధి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. 

ముస్లింల ఓట్లపై ఎవరి ధీమా వారిదే!
బెంగాల్‌లో ముస్లిం ఓటర్లదే అత్యంత కీలక పాత్ర. గతంలో 35ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు చరమగీతం పాడటంలో మమతకు మద్దతుగా నిలిచింది ఈ ఓటర్లే. దాదాపు 30శాతం ముస్లిం ఓటర్లు ఉన్న బెంగాల్‌లో 294 అసెంబ్లీ  సీట్లలోనూ వారు ప్రభావం చూపగలరు. బెంగాల్‌లో వీరి ప్రాధాన్యత ఏంటో తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపాకు బాగా తెలుసు. అందుకే మైనార్టీల సమస్యల పరిష్కారంలో తానే ఛాంపియన్‌ అని తరచూ చెప్పుకుంటారు దీదీ. ఆ ఓట్లపైనే ఆమె ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా ముస్లిం ఓటర్ల ప్రభావం అధికంగా ఉండే నందిగ్రామ్‌ నుంచే ఈసారి ఆమె బరిలో నిలిచారు. దీనికితోడు 42మంది ముస్లిం అభ్యర్థులను ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీలో దించారు. 

మరోవైపు, ముస్లిం ఓట్లు చీలితే తమకు లాభం చేకూరుతుందని భాజపా భావిస్తోంది. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఐఎస్‌ఎఫ్‌ నేత అబ్బాస్‌ సిద్ధిఖీలు ఈ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆ ఓట్లు చీలి మమతకు వచ్చే సీట్లు, ఓట్లకు గండిపడుతుందని నమ్ముతోంది. దీంతో మమతకు వచ్చే ఓట్లు, సీట్లకు నష్టం జరుగుతుందని భావిస్తోంది. మరోవైపు, ఉత్తర బెంగాల్‌లోని ముస్లింలు అత్యధికంగా ఉన్న జిల్లాలైన ముర్షిదాబాద్‌, దక్షిణ దినజ్‌పూర్‌లలో కాంగ్రెస్‌, తృణమూల్ మధ్య పోటీ ఉంటుందని, తద్వారా 2019 ఎన్నికల్లో జరిగినట్టే తమకు ఇది లాభం చేకూరుస్తుందని విశ్వసిస్తోంది.

సీపీఎం సానుభూతిపరులు ఎటువైపు?  

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా బెంగాల్‌ను పాలించిన సీపీఎం ఓటు బ్యాంకు కూడా ఈ ఎన్నికల్లో కీలకాంశం కానుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 29శాతానికి పైగా ఉన్న సీపీఎం ఓటు బ్యాంకు 2019 ఎన్నికల నాటికి 7.46శాతానికి పడిపోయింది. అదే సమయంలో భాజపా ఓటు బ్యాంకు 17 శాతం నుంచి 40.25శాతానికి పెరగడం గమనార్హం. రాష్ట్రంలో వామపక్షాలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేనందున.. తమ శత్రువైన తృణమూల్‌కు ఓటేసే పరిస్థితి ఉండదు. అయితే, ఆ ఓటర్లు భాజపా వైపు మొగ్గుచూపే అవకాశం ఉండొచ్చు. మరోవైపు, లెఫ్ట్‌ను ఆగర్భ శత్రువుగా భావించే మమతా బెనర్జీ కూడా ఇటీవలి కాలంలో వామపక్ష  ఓటర్లు తమకే ఓటు వేయాలంటూ పదే పదే విజ్ఞప్తి చేస్తుండటం గమనార్హం. మరోవైపు, ఈ ఎన్నికల్లో సీట్లు దక్కని ఆశావహులతో భాజపా, తృణమూల్‌ రెండు పార్టీలకు కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని