DMK: అసలు జైషా ఎవరు..? ఎన్ని సెంచరీలు కొట్టారు..?

దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు భాజపా తీవ్ర యత్నాలు చేస్తోంది.

Published : 24 Sep 2022 02:20 IST

భాజపా విమర్శలను తిప్పికొట్టిన డీఎంకే

చెన్నై: దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు భాజపా తీవ్ర యత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రాంతీయంగా బలమైన పార్టీలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. వారసత్వ రాజకీయాలను ఎత్తిచూపుతూ వాటిని ఎదుర్కోవాలని చూస్తోంది. తాజాగా తమిళనాడు పర్యటనలో భాగంగా డీఎంకేపై చేసిన విమర్శల్లో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం, నీట్‌ను వ్యతిరేకించడంపైనా మండిపడ్డారు. చదువు రాని వాళ్లు పాలిస్తే ఇలాగే ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పాలనపై మండిపడ్డారు. దీనిపై డీఎంకే గట్టి కౌంటర్ ఇచ్చింది. 

వారసత్వ రాజకీయాలపై స్పందిస్తూ.. ‘అసలు జైషా ఎవరు..? ఆయన ఎన్ని సెంచరీలు కొట్టారు..?’ అని డీఎంకే సూటిగా ప్రశ్నించింది. భాజపా అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడే జైషా. భారత్‌లో సంపదపరంగా అత్యంత విలువైన క్రీడామండలి బీసీసీఐకి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే కేంద్రంలో అధికారాన్ని చలాయిస్తోన్నవారి విద్యార్హతలు అడిగేస్థాయికి తాము దిగజారమంటూ కాషాయ పార్టీ విమర్శలను తిప్పికొట్టింది. ‘విద్వేష, విభజన రాజకీయాలకు భాజపా పెట్టింది పేరు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఈ పార్టీ విఫలమైంది. తమిళనాడు ప్రజలు తెలివైనవారు. 2024లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు’ అంటూ ఘాటుగా స్పందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని