MCD Polls 2022: దిల్లీలో భాజపా ఏకఛత్రాధిపత్యానికి బ్రేక్‌.. ఓటమికి కారణాలివేనా?

దిల్లీ మున్సిపల్‌ ఎన్నిక(MCD Polls 2022)ల్లో భాజపాకు పరాభవం తప్పలేదు. గత 15ఏళ్ల పాటు వరుస విజయాలతో దిల్లీ పురపాలికపై కాషాయజెండాను రెపరెపలాడించిన కమలనాథులు ఈసారి మేయర్‌ పీఠాన్ని కోల్పోయారు.

Published : 08 Dec 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ మున్సిపల్‌ ఎన్నిక (MCD Polls 2022)ల్లో భాజపాకు పరాభవం ఎదురైంది. గత 15ఏళ్ల పాటు వరుస విజయాలతో దిల్లీ నగర పాలికలపై కాషాయజెండాను రెపరెపలాడించిన కమలనాథులు ఈసారి మేయర్‌ పీఠాన్ని కోల్పోయారు. ఈ ఓటమితో భాజపాకు ఆప్‌ నుంచి తొలిసారి గట్టి షాక్‌ తగిలినట్టయింది. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఆప్‌ 134 స్థానాలు గెలుచుకోగా.. భాజపా 104సీట్లలో విజయం సాధించింది. అలాగే, కాంగ్రెస్‌ కేవలం 9స్థానాలకే పరిమితమైపోగా.. ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు. నువ్వానేనా అన్నట్టుగా కొనసాగిన ఈ పోరులో భాజపా ఓటమికి, ఆప్‌ విజయానికి కారణాలను ఓసారి పరిశీలిస్తే..

  1. ఎన్నికలకు దాదాపు ఆర్నెళ్ల ముందు నుంచే ఆప్‌ చమటోడ్చి పనిచేసింది. పక్కా వ్యూహాలతో భాజపాను దెబ్బతీసే వ్యూహాలు అమలుచేస్తూ వచ్చింది. ఇందులో భాగంగా భాజపా పాలిత కార్పొరేషన్లలో చెత్త పేరుకుపోవడంపై ఆప్‌ పెద్ద ఎత్తున క్యాంపెయిన్‌ చేపట్టి ఎన్నికల్లో ప్రధాన అంశంగా మార్చడంలో సఫలీకృతమైంది. గాజీపూర్‌, బలస్వా, ఓక్లాలలో చెత్త దిబ్బలు పేరుకుపోవడంపై భాజపాను ఇరుకునపెట్టడం ద్వారా లాభపడింది. పారిశుద్ధ్య వ్యర్థాల నిర్వహణకు శాస్త్రీయ పరిష్కారం చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఓట్లు రాబట్టుకోగలిగింది. 
  2. వరుసగా మూడుసార్లు గెలిచి 15ఏళ్లుగా మేయర్‌ పీఠాన్ని భాజపా ఏలుతుండటంతో అధికార పార్టీపై సహజంగా ఉండే ప్రజా వ్యతిరేకత ఆ పార్టీకి ప్రతికూలాంశంగా మారింది. 
  3. దిల్లీలో కేజ్రీవాల్‌ ఛరిష్మాతో సమానమైన పాపులర్‌ లీడర్‌ ప్రస్తుతం దిల్లీ భాజపాలో లేకపోవడం. నాయకత్వ లోపానికి తోడు ఆ పార్టీ శ్రేణుల్ని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ ముందుకు నడించగలిగే సమర్థత కలిగిన నేతలు కరవవడం, పార్టీ శ్రేణుల్లో చీలికలు భాజపా విజయావకాశాలకు గండికొట్టాయి. 
  4. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అవినీతిలో కూరుకుపోయిందన్న భావనను ప్రజల హృదయాల నుంచి తొలగించడంలో భాజపా విఫలం కావడం. అలాగే, తాము అధికారంలోకి వస్తే అవినీతిరహిత పాలన అందిస్తామని కేజ్రీవాల్‌ హామీ ఇవ్వడం ఆప్‌కు బాగా కలిసివచ్చింది.
  5. ఈ ఎన్నికల్లో భాజపా క్యాడర్‌ చురుగ్గా పనిచేయలేదు. బూత్‌ నిర్వహణ లోపం, కొన్నిచోట్ల ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్‌లను పంపిణీ చేయకపోవడం, పోలింగ్‌ బూత్‌లకు ఓటర్లను తీసుకురావడంలోనూ చొరవ చూపకపోవడం ఆ పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీసినట్టు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పేర్కొంటున్నారు. 
  6. భాజపా ఓటమికి టికెట్ల పంపిణీ కూడా ఒక కారణమని.. పార్లమెంట్‌ సభ్యులతో సరైన సంప్రదింపులు జరపకుండానే టిక్కెట్లు పంపిణీ చేశారన్న విమర్శలూ వినబడుతున్నాయి. దీంతో టిక్కెట్లు రాని వ్యక్తులు ఇంటికే పరిమితం కావడం, పనిచేస్తున్నట్టు నటించడం వంటి చర్యలు పార్టీకి నష్టం చేశాయని పలువురు నేతలు చెబుతున్నారు.
  7. ఎన్నికలకు కేవలం రెండు వారాల ముందు ఆప్‌ బ్రహ్మాండమైన ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రజలు నిత్యం ఫిర్యాదులు చేసే అంశాలను ఎన్నికల అజెండాగా మలిచింది. చెత్తాచెదారం తొలగింపు, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణం, రోడ్లపై గుంతలు వంటి అంశాలను ప్రచారాస్త్రంగా మలుచుకొని మధ్యతరగతి, దిగువ,మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకుంది. 
  8. దిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఉండటంతో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఉంటే నగరం అభివృద్ధి జరుగుతుందని, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరుగుతాయని ప్రజలువిశ్వసించడం.దీనికితోడు ఎన్నికలకు ఆర్నెళ్ల నుంచే ఆప్‌ శ్రమించడం, తమ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై ఆప్‌ ఫోకస్‌ పెట్టి పనిచేయడం, కేజ్రీవాల్‌ పట్ల జనాకర్షణ, ఆప్‌ ఇచ్చిన పలు హామీలు
  9. గతంతో పోలిస్తే కేజ్రీవాల్‌ సర్కార్‌ చర్యలతో ఈసారి చలికాలంలో వాయుకాలుష్య తీవ్రత తగ్గుముఖం పట్టడం, పంట వ్యర్థాల దహనానికి పంజాబ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం వంటివి ఆప్‌కు విజయం చేకూర్చాయి. 
  10. దిల్లీలో పారిశుద్ధ్యం అంశాన్ని ఆయుధంగా చేసుకున్న ఆప్‌ నేతలు 2020 ఏప్రిల్‌ నుంచి ఎన్నికల వరకు ఇదే అంశంపై దాదాపు 800లకు పైగా మీడియా సమావేశాలు పెట్టి భాజపాను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. విద్యుత్‌ సబ్సిడీ, ఉచిత బస్సు ప్రయాణాలు, విద్య, వైద్య సదుపాయాలు కల్పన పేద, మధ్యతరగతి ప్రజల్లో కేజ్రీవాల్‌ పనితీరుపట్ల అంచనాలు పెరిగాయి. 2017లో మున్సిపల్ ఎన్నికల వరకు ముస్లిం ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాలు, మురికివాడల్లో కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటింగ్‌ ఉండేది. కానీ ఈసారి ఆ పార్టీ ప్రభావం క్రమంగా మసకబారిపోవడం, జనాకర్షణ కలిగిన నేతలు క్షేత్రస్థాయిలో సీరియస్‌గా ప్రచారం చేయకపోవడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్‌ ఓట్లను ఆప్‌ భారీగాచీల్చి లాభపడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు