Gujarat Elections: ఈసారైనా కాంగ్రెస్‌ ‘KHAM’ వ్యూహం పని చేసేనా?

గుజరాత్‌లో ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే గతంలో అమలు చేసి  విఫలమైన KHAM వ్యూహాన్నే మరోసారి అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈసారి ఫలితం ఎలా ఉంటుందో..?

Updated : 29 Nov 2022 15:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌ ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గర పడుతోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం కాంగ్రెస్‌పై అంచనాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కానీ, సుదీర్ఘ అనుభవం కలిగిన ‘హస్తం’ పార్టీ.. ఎప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చుకుంటూ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ గతంలో అనుసరించిన ‘KHAM’ ( క్షత్రియ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం) వ్యూహం మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో ఈ ఎత్తుగడను అమలు చేసిన హస్తం పార్టీ అధికారంలోకి రాకపోయినా.. భాజపా మెజార్టీని బాగా దెబ్బతీసిందనడంలో విజయవంతమైంది. సరిగ్గా రెండు నెలల క్రితం ప్రధాని మోదీ భాజపా నాయకులందరినీ ఇదే అంశంపై హెచ్చరించారంటే ‘KHAM’ వ్యూహం భాజపాపై ఎంతటి ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

గుజరాత్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు భాజపా అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ సృష్టించిన రికార్డులను మాత్రం బద్దలు గొట్టలేకపోయింది. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకుగానూ ముఖ్యమంత్రి మాధవ్‌ సిన్హ్‌ సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 149 సీట్లను హస్తగతం చేసుకుంది. మొత్తం 55.5 శాతం ఓట్లు సాధించి చరిత్ర సృష్టించింది. వరుసగా 6 సార్లు అధికారంలోకి వచ్చిన భాజపా ఈ రికార్డును మాత్రం చేరుకోలేకపోయింది. అప్పట్లో ఇంతటి ఘనమైన రికార్డును కాంగ్రెస్‌ సొంతం చేసుకోవడానికి కారణం వెనుకబడిన వర్గాల వారేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58పట్టణ నియోజవర్గాల్లో భాజపాకు మంచి పేరుంది. అయితే రూరల్‌ నియోజవర్గ ఓటర్లను ఆకర్షించడంలో కమలం పార్టీ ప్రతిసారీ విఫలమవుతోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు హస్తం పార్టీ మరోసారి పావులు కదుపుతోంది. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణీకరణ పెరిగిపోతోందని, అందువల్ల ఎస్సీ, ఎస్టీ తదితర వెనుకబడిన వర్గాల వారు అస్తిత్వాన్ని కోల్పోవాల్సి వస్తోందంటూ తాజా ఎన్నికల్లో కమల దళంపై విమర్శలు గుప్పిస్తోంది.

పార్టీలో కీలక మార్పులు

KHAM వ్యూహాన్ని అమలు చేసేందుకు వీలుగా కాంగ్రెస్‌ కీలక మార్పులు చేసింది. క్షత్రియ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలవారికి పార్టీలో కీలక స్థానాలు కేటాయించింది. ఇందులో భాగంగానే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఇంద్రవిజయ్‌ సిన్హ్‌ గోహిల్‌ను జులైలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. మొత్తం ఏడుగురు కార్యనిర్వాహక అధ్యక్షుల్లో ఎస్సీ వర్గానికి చెందిన జిగ్నేశ్‌ మేవానీ, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఖాదిర్‌ ఫిర్జాదాలకు కూడా స్థానం కల్పించింది. తద్వారా ఆయా సామాజిక వర్గాల వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఎన్నికల వ్యూహకర్తగా పార్టీలో మంచి పేరున్న హార్దిక్‌ పటేల్‌ భాజపా తీర్థం తీసుకున్న తర్వాత కాంగ్రెస్‌ ఈ కీలక మార్పులు చేయడం గమనార్హం. వీరితోపాటు ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. మరోవైపు ‘KHAM’పై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది కాలం చెల్లిన వ్యూహమని, దీనికి విశ్రాంతినివ్వాల్సిన సమయమొచ్చిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. విజయం సాధించడానికి పాటిదార్ల ఓట్లు కీలకంగా మారిన నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆ సామాజిక వర్గానికి చెందిన 48 మంది అభ్యర్థులను బరిలోకి దించుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది.

KHAMకి ఎందుకు కాలం చెల్లింది?

‘KHAM’ వ్యూహానికి కాలం చెల్లిందని కొందరు ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారో తెలియాలంటే.. గత చరిత్రను పరిశీలించాల్సి ఉంటుంది. 1995లో కాంగ్రెస్‌ నుంచి తొలిసారి భాజపా అధికారాన్ని దక్కించుకుంది. 45 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో అన్నిరకాలుగా చితికిపోయిన పాటిదార్లు ఈ ఎన్నికల్లో భాజపాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారి మద్దతుతోనే విజయం సాధించిన కమల దళం.. కేశూభాయ్‌ పటేల్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2001లో నరేంద్ర మోదీ సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. క్షేత్రస్థాయి నుంచి పార్టీని సంస్కరిస్తూ వచ్చారు. పాటిదార్లకు తగిన గుర్తింపునిచ్చారు. అయితే, 2002 ఎన్నికల్లో  ‘KHAM’ వ్యూహాన్ని అమలు చేసిన కాంగ్రెస్‌ మళ్లీ పరాజయం పాలైంది.

2007లో మోదీపై వ్యతిరేకతతో.. మంత్రిగా పని చేసిన గోర్ధన్‌ జడాఫియా, పాటిదార్‌ సామజిక వర్గానికి చెందిన లెవుయా పాటిల్‌తో కలిసి మహా గుజరాత్‌ జనతా పార్టీ (ఎంజేపీ)పేరిట కూటమిని ఏర్పాటు చేశారు. మోదీకి వ్యతిరేకంగా బరిలోకి నిలిచారు. వీళ్లందరికీ కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. అయితే  ఈ ఎన్నికల్లో కేవలం 59 స్థానాలకే  కాంగ్రెస్‌ పరిమితమైంది. 2012 ఎన్నికల్లోనూ ఇదే కథ పునరావృతమైంది. జడాఫియా, మాజీ సీఎం కేశూభాయ్‌ పటేల్‌తో  కలిసి గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీ (జీపీపీ)ని ఏర్పాటు చేసి 167 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించారు. అయితే, కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. ఈసారి 176స్థానాల్లో అభ్యర్ధులను నిలిపిన కాంగ్రెస్‌.. కొన్ని చోట్ల జీపీపీ అభ్యర్థులకు మద్దతిచ్చినప్పటికీ  ఫలితం లేకపోయింది. అనంతరం 2014లో భాజపాలో జీపీపీ విలీనమైంది. దీంతో పాటిదార్లను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్‌ మరోసారి విఫలమైంది.

హార్దిక్‌ వ్యూహం ఫలించినా..

పాటిదార్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని 2015లో గుజరాత్‌లో నిరసనలు భగ్గుమన్నాయి. ఈ నిరసనలు దాదాపు 2017 వరకు కొనసాగాయి. ఇక్కడే హర్దిక్‌ పటేల్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ ఆందోళనలకు కాంగ్రెస్‌ పూర్తి మద్దతు ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఆ ఎన్నికల్లో  22 ఏళ్ల చరిత్రలో తొలిసారి అత్యధికంగా 77 స్థానాల్లో విజయం సాధించి.. భాజపాను 100 సీట్లకు పరిమితం చేయగలిగింది. హార్దిక్‌ పటేల్‌ వ్యూహం ఫలించిందని, 2022 ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమన్న ధీమా కాంగ్రెస్‌లో ఏర్పడింది. అయితే, హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌ను వీడి ఇటీవల భాజపాలో చేరిపోవడం హస్తం పార్టీకి కొరుకుడు పడని అంశంగా మారింది. పాటిదార్ల మద్దతుతో ఈసారి అధికారం చేపట్టాలని భావించిన కాంగ్రెస్‌ వ్యూహానికి ఈ పరిణామం దెబ్బకొట్టింది. దీంతో తాజా ఎన్నికల్లో పాత వ్యూహాన్నే అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ సారైనా ఆ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని