Arvind Kejriwal: ఇదే కొనసాగితే.. అభివృద్ధి ఎలా సాధ్యం?: కేజ్రీవాల్‌

కేంద్ర ప్రభుత్వం ( Cetral Govt) ప్రతి వ్యవస్థ కార్యకలాపాల్లోనూ జోక్యం చేసుకుంటోందని, ప్రతి ఒక్కరితోనూ కయ్యం పెట్టుకుంటోందని దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశాభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు.

Updated : 04 Feb 2023 17:12 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (APP) అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రతీ వ్యవస్థతోనూ కేంద్ర ప్రభుత్వం (Cetral Govt) కయ్యానికి దిగుతోందని ఆరోపించారు. అటు రాష్ట్రాలు, ఇటు స్వతంత్ర వ్యవస్థల కార్యకలాపాలకు కేంద్రం అడ్డుపడుతోందని విమర్శించారు. న్యాయమూర్తుల నియామకంలో తల దూర్చుతోందని, రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీం కోర్టు (Supreme Court) కొలీజియం సిఫారసు చేసిన పేర్లను ఆమోదించకుండా తాత్సారం చేయడం ఇటీవల చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

‘‘ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరితో ఎందుకు విభేదాలకు దిగుతోంది?న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరితోనూ గొడవలు పెట్టుకుంటోంది. ఇదే కొనసాగితే దేశాభివృద్ధి కుంటుపడుతుంది. మన పని మనం చేసుకోవాలి. ఇతరులు కూడా వాళ్ల పని వాళ్లు చేసుకునేలా సహకరించాలి. వారి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దు’’ అంటూ ట్వీట్‌ చేశారు.

విద్యా విధానంపై అధ్యయనం చేసేందుకు కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల బృందాన్ని ఫిన్లాండ్‌ పంపాలని ఇటీవల దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, దీనికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అమోదం తెలపకుండా.. దీనికి సంబంధించిన దస్త్రాలను తన వద్దనే ఉంచుకోవడంతో వివాదం చెలరేగింది.ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సహా ఆప్‌ ఎమ్మెల్యేల బృందం రాజ్‌భవన్‌ ఎదుట ఆందోళకు దిగింది. మరోవైపు దిల్లీ మద్యం కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని కేంద్రం పావులా వాడుకుంటోందని ఆప్‌ విమర్శిస్తోంది.  ఇలా కేంద్ర ప్రభుత్వం కేవలం దిల్లీ పైనే కాకుండా వివిధ రాష్ట్రాలు, స్వతంత్ర వ్యవస్థలు కూడా తమ పని చేసుకోకుండా అడ్డుపడుతోందని కేజ్రీవాల్‌ విమర్శించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు