Adani Row: జేపీసీతో దర్యాప్తునకు మోదీ ఎందుకు భయపడుతున్నారు?: కాంగ్రెస్‌ సూటి ప్రశ్న

అదానీ గ్రూపు(Adani group)పై వచ్చిన ఆరోపణలపై జేపీసీ(JPC)తో దర్యాప్తునకు ప్రధాని ఎందుకు భయపడుతున్నారు? కాంగ్రెస్‌ ఏ ఒక్క వ్యక్తికో, పెట్టుబడిదారీ విధానానికో వ్యతిరేకం కాదు.. గుత్తాధిపత్యానికి, ఆశ్రితపక్షపాతానికి వ్యతిరేకం అని ఆ పార్టీ నేత గౌరవ్‌ వల్లభ్‌ అన్నారు.

Published : 17 Feb 2023 18:13 IST

జైపూర్‌: అదానీ గ్రూపు(Adani Group)పై వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో దర్యాప్తు జరిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ఆ కంపెనీ మోసాలకు పాల్పడినట్టు అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే పరిశోధనా సంస్థ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపకుండా ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన రాజస్థాన్‌లోని జైపూర్‌లో మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూపు వల్ల చిన్నచిన్న మదుపుదారులు రూ.10.5లక్షల కోట్లు మేర నష్టపోయారని.. సెబీ, ఆర్‌బీఐ వంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థలు మౌనంగా చూస్తున్నాయని విమర్శించారు.

అదానీ గ్రూప్‌ వ్యవహారం ఇటీవల పార్లమెంట్‌ ఉభయసభల్ని కుదిపేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సహా పలు విపక్షాలు  ఈ అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ)తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశాయి. అయితే, అందుకు కేంద్రం అంగీకరించకపోవడాన్ని కాంగ్రెస్‌ నేత గౌరభ్‌ వల్లభ్‌ తప్పుపట్టారు. అదానీ అంశంపై సభలో మాట్లాడితే వాటిని సభాకార్యకలాపాల నుంచి తొలగించారన్నారు. తాము ఏ ఒక్క వ్యక్తికి గానీ, పెట్టుబడిదారీ విధానానికి గానీ వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. కానీ గుత్తాధిపత్యం, ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకమన్నారు. అలాగే.. కాంగ్రెస్‌ పార్టీ ‘అమృత్‌ కాల్‌’కు వ్యతిరేకం కాదన్న వల్లభ్‌.. మిత్ర్‌కాల్‌కు పూర్తి వ్యతిరేకమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ అదానీ గ్రూపు ఏదో ఒక భారీ ప్రాజెక్టులోకి దిగడం యాదృచ్ఛికమా అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని