Lakhimpur Kheri incident: రైతులపై ఎందుకంత ద్వేషం?.. మోదీకి కేజ్రీవాల్‌ ప్రశ్న

యూపీలోని లఖింపుర్‌ ఖేరిలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. బాధిత రైతు కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ న్యాయం చేయాలని......

Published : 07 Oct 2021 01:01 IST

దిల్లీ/ముంబయి/లఖ్‌నవూ: యూపీలోని లఖింపుర్‌ ఖేరిలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. బాధిత రైతు కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ న్యాయం చేయాలని, ఈ కేసులో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రాను పదవి నుంచి తప్పించి ఆయన కుమారుడిని అరెస్టు చేయాలన్నారు. లఖింపూర్‌ ఖేరి ఘటనల నేపథ్యంలో బుధవారం వర్చువల్‌గా మీడియా సమావేశంలో కేజ్రీవాల్‌ మాట్లాడారు. రైతులను వాహనాలతో తొక్కించి చంపినవారిని రక్షించేందుకు ‘మొత్తం వ్యవస్థ’ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రధానిని ప్రశ్నించారు. 

‘‘ఏడాది కాలంగా రైతులు ధర్నా చేస్తున్నారు. ఇందులో భాగంగా 600మందికి పైగా రైతులు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. ఆపై ఇప్పుడు రైతులను చక్రాల కింద తొక్కి చంపుతున్నారు. రైతులపై ఎందుకంత ద్వేషం? హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రాని ఇంకా ఎందుకు పదవి నుంచి తప్పించలేదు. రైతులకు న్యాయం చేయాలని, నిందితులకు శిక్షపడాలని ఈ దేశంలోని ప్రతి పౌరుడూ కోరుకుంటున్నారు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోండి’’ అని ప్రధానిని కేజ్రీవాల్‌ కోరారు. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్షాలను అడ్డుకుంటున్న యూపీ ప్రభుత్వంపైనా కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ‘‘ప్రధాని జీ.. ఓవైపు ఆజాదీ కా మహోత్సవ్‌ జరుగుతుంటే.. మరోవైపు ప్రతిపక్ష నేతలు లఖింపూర్‌ ఖేరికి వెళ్లకుండా అరెస్టు చేస్తున్నారు. ఇది ఏరకమైన స్వేచ్ఛ? బ్రిటిష్‌ పాలకులు ఇలాంటి చర్యలే అనుసరించారు’’ అన్నారు.


యూపీ ఏమైనా పాక్‌లో ఉందా?: సంజయ్‌ రౌత్‌

 

లఖింపుర్ ఖేరికి వెళ్లకుండా విపక్ష నేతలను అడ్డుకోవడంపై శివసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేతల్ని నిర్బంధిస్తున్నారంటూ భాజపా ప్రభుత్వంపై మండిపడింది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా అంటూ విమర్శలు గుప్పించింది. ప్రాణాలు కోల్పోయిన అన్నదాతల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అడ్డుకోవడం శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తీవ్రంగా స్పందించారు. 

‘లఖింపుర్‌లో 144 సెక్షన్‌ అమల్లో ఉంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం విపక్ష నేతల్ని లఖ్‌నవూలో అరెస్టు చేస్తోంది. యూపీ ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా? ఇదేమైనా కొత్త తరహా లాక్‌డౌనా? ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది. ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తోంది. రైతులపై నుంచి వాహనం వెళ్లినట్లు ఆధారాలున్నాయి’ అని రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రియాంక గాంధీని అరెస్టు చేశారు. రాహుల్ విమానం ఎక్కకుండా ఆపేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికీ అదే పరిస్థితి ఎదురైంది. వాళ్లు ఏ నేరం చేశారు. దేశంలో కొత్త రాజ్యాంగం నడుస్తోందా?’ అని ప్రశ్నించారు.


ఒక్కో రైతు కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటన

యూపీలోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మృతిచెందిన నలుగురు రైతులు, ఓ పాత్రికేయుడి కుటుంబాలకు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు అండగా నిలబడ్డారు. మృతుల కుటుంబాలకు పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు చెరో రూ.50లక్షల చొప్పున మొత్తంగా రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించారు. లఖ్‌నవూ ఎయిర్‌పోర్టులో పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. లఖింపూర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింస 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్‌ నరమేధాన్ని తలపిస్తోందని చరణ్‌జిత్‌ చన్నీ వ్యాఖ్యానించారు. యూపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు.


లఖింపుర్ ఖేరి ఘటనపై ‘సిట్‌’ ఏర్పాటు

 

లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటైంది. ఈ ఘటనపై సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. నమోదైన రెండు కేసుల దర్యాప్తు నిమిత్తం.. అదనపు ఎస్పీ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ప్రకటించింది. దర్యాప్తు సమయంలో అనేక సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉందని సిట్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి తనయుడు ఆశిష్‌ మిశ్రాపై స్థానిక పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మరికొందరి పేర్లూ పొందుపరిచినట్లు సమాచారం. ఇరుపక్షాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అదనపు డీజీ తెలిపారు.

రైతు గుర్విందర్‌ మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం

హింసాత్మక ఘటనలో మరణించిన రైతు గుర్విందర్ సింగ్ మృతదేహానికి అధికారులు మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు. లఖ్‌నవూ నుంచి వచ్చిన వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ప్రక్రియను పూర్తిచేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పోస్టుమార్టం ప్రక్రియను రికార్డు చేశారు. అనంతరం గుర్విందర్‌సింగ్‌ కుటుంబసభ్యులు అంత్యక్రియలను పూర్తిచేశారు. గాయాల కారణంగానే నలుగురు రైతులూ మృతిచెందినట్లు పోస్టుమార్టం రిపోర్టు పేర్కొనడంపై గుర్విందర్‌సింగ్‌ కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు. తూటాల కారణంగానే గాయపడి మరణించారని మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుబట్టారు. దీంతో ఆయన మృతదేహానికి బుధవారం మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని