శశి‘కలకలం’ వెనుక! 

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం అంత సులభం కాదు. ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయన్న సామెత రాజకీయాలకు సరిగ్గా నప్పుతుంది. ఎన్నికల సమయంలో.........

Updated : 04 Mar 2021 18:02 IST

చిన్నమ్మ హఠాత్తు నిర్ణయానికి కారణాలపై చర్చ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం అంత సులభం కాదు. ఎన్నికల సమయంలో అయితే రాజకీయ పార్టీల వ్యూహాలు, ఎత్తుగడలు అంతుచిక్కవు. ఎవరు ఎవరికి మిత్రులవుతారో, ఎందుకు శత్రువులవుతారో కూడా ఊహించడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దివంగత మాజీ సీఎం జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ అనూహ్యంగా  ప్రకటించిన నిర్ణయం కలకలం రేపింది. రాజకీయాలు, ప్రజాజీవితానికి వీడ్కోలు చెబుతూ ప్రధాన శత్రువైన డీఎంకేను ఓడించాలంటూ శ్రేణులకు పిలుపునివ్వడం తమిళనాట సంచలనంగా మారింది. చిన్నమ్మ హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక స్పష్టమైన కారణాలేంటో వెల్లడించకపోయినప్పటికీ బయట రకరకాల విశ్లేషణలు మాత్రం వినబడుతున్నాయి.

చిన్నమ్మ  అందుకే చిన్నబోయిందా?

జైలులో ఉన్నప్పుడు తనను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించినప్పటికీ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకొని తమిళనాట అడుగు పెట్టిన తర్వాత కూడా ఆ పార్టీ నేతలు తనను  'పార్టీ అగ్రనేతగా అంగీకరించకపోవడంతో చిన్నమ్మ చిన్నబోయినట్టు సమాచారం. అంతేకాకుండా తన పట్ల నేతలు అనుసరిస్తున్న వైఖరితో ఆమె బాధపడినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే-భాజపా కూటమిలో తన మేనల్లుడు టీటీవీ దినకరన్‌ ప్రారంభించిన ఏఎంఎంకేను, తనను కూడా మళ్లీ పార్టీలో చేర్చుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రతిపాదించినా దీనిపై సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేయడంతో ఆమె మనస్తాపం చెంది రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కొందరు కిందిస్థాయి కార్యకర్తల్లో మద్దతు ఉన్నప్పటికీ పార్టీపై ఆమెకు అంతగా పట్టులేదు. ఏప్రిల్‌లో జరగబోయే ఎన్నికల్లో  అన్నాడీఎంకేకు ప్రతికూలత ఎదురైతే ఓట్లు చీల్చారన్న అపవాదు తనకు ఎదురవుతుందేమోనని ఆలోచించి ముందు జాగ్రత్తతో ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని మరికొందరు పేర్కొంటున్నారు. కేసుల భయానికి తోడు డీఎంకే నేత స్టాలిన్‌ కంటే ఈపీఎస్‌- ఓపీఎస్‌లే తనకు తక్కువ ప్రమాదకారులని భావించి ప్రభుత్వ అనుకూల ఓట్లు చీలకుండా ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని సమాచారం.

వ్యక్తిగత ఛరిష్మా లేకపోవడం!

తమిళనాట రాజకీయాల్లో శశికళ కీలకంగా లేకపోయినప్పటికీ అక్కడి ప్రజలకు బాగా తెలిసిన వ్యక్తి. జయలలితకు తోడు నీడగా ఉంటూ ప్రత్యేక గుర్తింపు పొందారామె. అమ్మ మరణానంతరం అన్నాడీఎంకేలో కీలక పాత్ర పోషిస్తారని భావించిన సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్లడంతో కథ పూర్తిగా అడ్డం తిరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమెను ఈపీఎస్‌-ఓపీఎస్‌ కలిసి బహిష్కరణ వేటు వేయడం, క్యాడర్‌ ఈపీఎస్‌ వైపు మళ్లడం ఆమెకు ప్రతికూలాంశాలుగా మారాయి. దీనికితోడు జయలలిత చాటున ఉంటూ వచ్చిన శశికళకు వ్యక్తిగత ఛరిష్మా లేకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.

భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదు
శశికళ ఈ సంచలన నిర్ణయం తీసుకొనే ముందు రెండు, మూడు రోజులుగా ఆలోచించారని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇదేదో భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదని,  కుటుంబ సన్నిహితులతోనూ చర్చించాకే బుధవారం రాత్రి ప్రకటన రూపంలో ఆమె నిర్ణయం వెల్లడించారని  అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని