
Punjab politics: సిద్ధూపై ఆరోపణల విషయంలో మౌనం ఎందుకు?
కాంగ్రెస్‌ను ప్రశ్నించిన భాజపా సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్
దిల్లీ: ఒకవైపు పంజాబ్‌లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరో ఉత్కంఠ కొనసాగుతుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీపై భాజపా విమర్శలకు దిగింది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్ సింగ్ సిద్ధూపై మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిన తీవ్ర ఆరోపణల విషయంలో అధిష్ఠానం ఎందుకు మౌనం వహిస్తోందని భాజపా సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘సిద్ధూపై అమరీందర్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన్ను దేశ ద్రోహిగా పేర్కొన్నారు. ఒకవైపు భారత్‌పై పాక్ ప్రేరేపిత దాడులు జరుగుతుండగా.. మరోవైపు 2018లో సిద్ధూ ఆ దేశాన్ని సందర్శించి, అక్కడి ఆర్మీ చీఫ్ బజ్వాను కలిసిన విషయం అందరికి తెలిసిందే. కానీ.. నిన్న అమరీందర్ ఇదే అంశంపై ప్రశ్నించారు. ఇది చాలా పెద్ద ఆరోపణ. మరి ఈ అంశంలో పార్టీ అగ్రనేతలు ఎందుకు మౌనంగా ఉన్నారనేదే మా ప్రశ్న’ అని అన్నారు. కాంగ్రెస్.. ఈ ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, సిద్ధూపై విచారణ ప్రారంభిస్తుందా? అని సవాల్ విసిరారు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన సిద్ధూపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన సీఎం అయితే.. దేశ భద్రతకే ముప్పు అంటూ వ్యాఖ్యానించారు. తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధూ పేరును ప్రతిపాదిస్తే అంగీకరించబోననీ హెచ్చరించిన విషయం తెలిసిందే.