Matoshree: మాతోశ్రీకి ఎందుకు తిరిగి వచ్చారంటే?

మహారాష్ట్ర సీఎం, శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే.. ముఖ్యమంత్రి అధికార నివాసమైన ‘వర్ష’ను వీడి తన సొంత గృహమైన ‘మాతోశ్రీ’కి చేరుకున్న విషయం తెలిసిందే...

Published : 27 Jun 2022 01:21 IST

ముంబయి: మహారాష్ట్ర సీఎం, శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే.. ముఖ్యమంత్రి అధికార నివాసమైన ‘వర్ష’ను వీడి తన సొంత గృహమైన ‘మాతోశ్రీ’కి చేరుకున్న విషయం తెలిసిందే. ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. కూటమి ప్రభుత్వం కూలిపోయేదశలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి మాతోశ్రీకి చేరుకోవడంపై పలు విశ్లేషణలు జరుగుతున్నాయి.

మాతోశ్రీ’.. శివసేన వ్యవస్థాపకులు బాల్‌ఠాక్రే నివాసం. ఇక్కడి నుంచే ఆయన అన్ని రాజకీయ వ్యూహాలు చేసేవారు. ఈ నేపథ్యంలోనే శివసైనికులు ఈ భవనాన్ని పవిత్రంగా చూస్తారు. ఈ కట్టడంతో వారి భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి. ఉద్ధవ్‌ ఠాక్రే సైతం ఇక్కడ నుంచే రాజకీయ వ్యూహాలు ప్రారంభించడం విశేషం. రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టాలన్న శివసేన ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతుంది.

బాల్‌ఠాక్రే ఉన్న సమయంలో పార్టీలో సీనియర్‌ నాయకుడు చగన్‌ భుజ్‌బల్‌ తిరుగుబాటు చేశారు. ఆయనతోపాటు పలువురు సీనియర్లు ఫిరాయించారు. దీంతో ఆగ్రహించిన ఠాక్రే.. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ పత్రిక ‘సామ్నా’లో ఉద్వేగభరిత వ్యాసం రాశారు. దీంతో లక్షలాది మంది శివసైనికులు ముంబయి చేరుకొని రాజీనామా వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆయన రాజీనామా వెనక్కు తీసుకున్నారు. పార్టీలో పెద్ద నేతలు వెళ్లిపోయినా క్యాడర్‌ మాత్రం చెక్కుచెదరకుండా ఉండేందుకు ఈ చర్య దోహదపడింది.

సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సైతం.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల మధ్య ఆయన మాతోశ్రీకి తిరిగి రావడంతో శివసైనికులు భావోద్వేగానికి గురయ్యారు. లక్షలాదిమంది మాతోశ్రీ ముందు చేరుకొని మద్దతు ప్రకటిస్తున్నారు. రెబల్స్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఒక వేళ తమ ప్రభుత్వం కూలిపోయినా, రెబల్‌ ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా.. క్యాడర్‌ మాత్రం ఆయన సారథ్యంలోని శివసేన వైపు ఉండనుంది. దీంతో రాబోయే ఎన్నికల్లో సేన మరింత బలం పుంజుకోవడానికి మాతోశ్రీ కేంద్ర బిందువు కానుందని చెప్పొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని