Himachal Elections: హిమాచల్‌లో భాజపా పరాజయం.. అనురాగ్‌ ఠాకూర్‌పై విమర్శలు

హిమాచల్‌ ప్రదేశ్‌లో భాజపా పరాజయం పాలవ్వడంపై విమర్శలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కమలదళం పరాజయం పాలవ్వడానికి  కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌నే కారణమంటూ సోషల్‌ మీడియాలో దుమారం రేగుతోంది.

Published : 09 Dec 2022 01:33 IST

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో (Himachal Pradesh) భాజపా పరాజయం పాలవ్వడంపై విమర్శలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కమలదళం పరాజయం పాలవ్వడానికి  కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur)నే కారణమంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర భాజపాలో ఆయన అంతర్యుద్ధానికి తెరలేపారంటూ కొందరు భాజపా మద్దతుదారులు సామాజిక మాధ్యమాల వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP nadda) స్వరాష్ట్రమైన హిమాచల్‌లో ఈసారి రెబల్‌ అభ్యర్థుల బెడద ఎక్కువైంది. మొత్తం 68 స్థానాలకు గానూ దాదాపు 21 చోట్ల భాజపా రెబల్‌ అభ్యర్థులు బరిలోకి దిగారు. కానీ, వారు గెలిచింది కేవలం రెండు స్థానాలు మాత్రమే. రెబల్స్‌ కారణంగా భాజపా అనుకూల ఓట్లు చీలిపోయాయి. అది కాంగ్రెస్‌ విజయానికి దోహదం చేసింది. మరోవైపు తాజా ఎన్నికల్లో కేవలం భాజపాలోనే మూడు వర్గాలుగా ఏర్పడినట్లయింది. 1.అనురాగ్‌ ఠాకూర్‌ వర్గం, 2. జేపీ నడ్డా వర్గం. 3.ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ వర్గం. అభ్యర్థుల ఎంపికలో వీళ్లమధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో కొందరు రెబల్స్‌గా బరిలోకి దిగారు. నేతలు బయటికి ఒకేలా కనిపించినా.. లోలోపల మాత్రం ఎవరి వర్గం అభ్యర్థులను వారే గెలిపించుకునేందుకు ప్రయత్నించడం కమలం పార్టీ విజయావకాశాలను దెబ్బతీసింది. వాళ్లంతా కలిసి గెలుపునకు కృషిచేసి  ఉంటే భాజపాకు హిమాచల్‌లో ఓటమి తప్పదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు భాజపాలో కీలకంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు ఈ సారి సీటు కేటాయించకుండా అధిష్ఠానం పక్కన పెట్టింది. దీంతో ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు కొందరు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రెబల్స్‌కు ఆయన పరోక్షంగా మద్దతు తెలపడంతో భాజపా అనుకూల ఓట్లు చీలిపోయేందుకు కారకులయ్యారని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్‌లో మోదీ అనుసరించిన వ్యూహాన్ని అభినందిస్తూనే.. హిమాచల్‌ భాజపాపై పార్టీ మద్దతుదారులు మండిపడుతున్నారు. పార్టీ కీలక నేతలు ఉన్నప్పటికీ ప్రియాంక గాంధీనే ప్రచారంలో కీలకంగా వ్యవహరించారని, ఆమె ఒక్కరే ప్రచారం చేసి ఇంతటి ఘన విజయాన్ని సాధించారని ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు. భాజపా అతిరథ మహారథులు చేసిన ప్రచారాన్ని ఆమె ఒక్కరే తిప్పికొట్టారని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని