Goa: అప్పుడు భార్య.. ఇప్పుడు భర్త.. దక్కిన మంత్రి పదవి

తీర రాష్ట్రం గోవాలో భాజపా సర్కారు కొలువు దీరింది. ప్రమోద్‌ సావంత్‌ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు

Published : 29 Mar 2022 02:37 IST

పనాజీ: పర్యాటక రాష్ట్రం గోవాలో భాజపా సర్కారు కొలువు దీరింది. ప్రమోద్‌ సావంత్‌ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా.. గతంలో ప్రమోద్‌ కేబినెట్‌లో పనిచేసిన ఏకైక మహిళా మంత్రి జెన్నిఫర్‌ మాన్సరేట్‌కు తాజా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. జెన్నిఫర్‌ స్థానంలో ఆమె భర్త అతనాసియో మాన్సరేట్‌ను మంత్రిగా తీసుకున్నారు. 

ప్రమోద్‌ సావంత్‌ మంత్రివర్గంలో ఈ సారి కొందరు కొత్త వారికి చోటు కల్పించారు. అందులో అతనాసియో ఒకరు. భాజపా కీలక నేతల్లో ఒకరైన అతనాసియోను స్థానికంగా బాబుష్ అని పిలుస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ స్థానం నుంచి గెలుపొందిన ఆయన. మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో అతనాసియో కూడా ఉన్నారు. 

అతనాసియో సతీమణి జెన్నిఫర్‌ మాన్సరేట్‌ తలైగావ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రమోద్‌ సావంత్‌ తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన మంత్రివర్గంలో జెన్నిఫర్‌కు చోటు కల్పించారు. రెవెన్యూ, ఐటీ, కార్మిక, ఉపాధి శాఖ బాధ్యతలు అప్పగించారు. అయితే తాజాగా ఏర్పడిన ప్రభుత్వంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో జెన్నిఫర్‌కు బదులుగా ఆమె భర్తకు మంత్రి పదవి కల్పించినట్లు తెలుస్తోంది.

గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్‌ సావంత్‌ నేడు ప్రమాణస్వీకారం చేశారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరై సావంత్‌ను అభినందించారు. ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన సంగతి తెలిసిందే. 40 స్థానాలున్న అసెంబ్లీకి కమలం పార్టీ నుంచి 20 మంది సభ్యులు ఎన్నికయ్యారు. దాంతో మెజార్టీకి ఒక్క సీటు దూరమైంది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, మహారాష్ట్ర వాది గోమంతక్‌ పార్టీ(ఎంజీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు భాజపాకు మద్దతు పలికారు. ఈ క్రమంలో అసెంబ్లీలో సావంత్‌ తన మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం రెండురోజుల పాటు అసెంబ్లీ సెషన్‌ కోసం గవర్నర్ సీఎస్ శ్రీధరన్‌ పిళ్లై ఆదేశాలిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని