అప్పుడు కుస్తీ.. ఇప్పుడు దోస్తీ: బాబాయ్‌ పార్టీతో పొత్తుకు అఖిలేశ్‌ రెడీ

UP polls: ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించారు.

Published : 04 Nov 2021 01:41 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించారు. ఆయనకు పూర్తి గౌరవం ఇస్తామని తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలతో ఎస్పీ పొత్తు పెట్టుకుంటుందని తెలిపారు. బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ పార్టీతో కూడా కలిసి పనిచేస్తామని చెప్పారు.

అఖిలేశ్‌ యాదవ్‌తో విబేధాల కారణంగా ఎస్పీ నుంచి బయటకొచ్చిన శివపాల్‌ యాదవ్‌ గతేడాది ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. ఇటీవల ఓ సందర్భంలో ఆయన సైతం ఎస్పీతో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అఖిలేశ్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. గతంలో బాబాయ్‌- అబ్బాయ్‌ మధ్యనున్న నెలకొన్న వైరుధ్యాన్ని ఎన్నికల వేళ పక్కన పెట్టడం గమనార్హం.

మరోవైపు వల్లభభాయ్‌ పటేల్‌తో జిన్నాను పోల్చుతూ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్న సీఎం యోగి ఆదిత్యనాథ్‌ డిమాండ్‌పైనా అఖిలేశ్‌ యాదవ్‌ స్పందించారు. ఏ చిన్న విషయాన్నైనా రాజకీయం చేయాలనే దృష్టితో భాజపా చూస్తుందని, అభివృద్ధి, ఉద్యోగం గురించి మాత్రం ఎప్పుడూ మాట్లాడదని పేర్కొన్నారు. ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దాని గురించి మాట్లాడాలని సూచించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ‘‘సర్దార్‌ పటేల్, మహాత్మా గాంధీ, నెహ్రూ, జిన్నా ఒకే సంస్థలో చదివి న్యాయవాదులయ్యారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించారు. పోరాటానికి వారు ఎన్నడూ వెనకడుగు వేయలేదు’’ అని అఖిలేశ్‌ వ్యాఖ్యానించారు. జిన్నాను పటేల్‌తో పోల్చడంపై భాజపా మండిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని