Mamata: వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేవ్‌.. ఒంటరిగానే బరిలోకి!: మమత

2024 ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) అధినేత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు.

Published : 03 Mar 2023 01:53 IST

కోల్‌కతా: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (TMC) ఏ ఇతర  రాజకీయ పార్టీలతోనూ పొత్తులు పెట్టుకోబోదని ఆ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ్‌బెంగాల్‌ (Westbengal) ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (mamata benarjee) స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో ఒంటరిగానే బరిలోకి దిగుతామని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం.. ఆమె మాట్లాడుతూ.. ‘‘ 2024 ఎన్నికల్లో కేవలం ప్రజలకు, తృణమూల్‌కు మధ్యనే పొత్తు ఉంటుంది. అంతే తప్ప ఏ ఇతర పార్టీలతోనూ కూటమి ఏర్పాటు చేయబోము. ప్రజల మద్దతుతో ఒంటరిగానే పోరాటం చేస్తాం’’ అని మమతాబెనర్జీ అన్నారు. ఎవరైతే భాజపాను ఓడించాలనుకుంటారో.. వాళ్లంతా తృణమూల్‌కే ఓటు వేస్తారని ఆమె అన్నారు. అంతేకాకుండా సీపీఐ (ఎం), కాంగ్రెస్‌కు ఓటు వేసినా ఆ ఓట్లన్నీ భాజపాకే చెందుతాయని తెలిపారు. తాజా ఎన్నికల ఫలితాల్లో ఇదే విషయం స్పష్టమైందని దీదీ అన్నారు. త్రిపురలోని 60 స్థానాల్లో తృణమూల్‌ ఒక్క చోట కూడా విజయం సాధించకపోగా.. మేఘాలయలో 5 స్థానాల్లో గెలుపొందింది.

బెంగాల్‌లోని సగర్దిఘి ఉపఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్‌ను ఓడించి కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. ఈ ఫలితంపై ఆమె నిరాశకు గురయ్యారు. సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు భాజపాతో పొత్తుపెట్టుకున్నాయని మమత ఆరోపించారు.‘‘సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు భాజపాతో పొత్తుపెట్టుకున్నాయి. అపవిత్ర పొత్తుతో భాజపాపై కాంగ్రెస్‌ ఏవిధంగా పోరాడుతుంది? వామపక్షాలు ఏవిధంగా భాజపాను అడ్డుకుంటాయి? భాజపాకు తామే వ్యతిరేకమని సీపీఎం, కాంగ్రెస్‌ ఎలా చెప్పుకుంటాయి?’’ అని మమత ప్రశ్నించారు. సగర్దిఘిలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఎం, భాజపా పార్టీలు ‘ మతం కార్డు’ను ప్రదర్శించాయన్నారు. అయితే భాజపా బహిరంగంగానే ప్రకటించినప్పటికీ కాంగ్రెస్‌, సీపీఎంలు అంతకుమించి చేశాయని విమర్శించారు. ఇక నుంచి సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు చెప్పేవి వినేది లేదని, ఇదొక గుణపాఠం అన్నారు. భాజపాతో కలిసి పనిచేసే ఏ పార్టీతోనూ తమ పార్టీ పొత్తు పెట్టుకోదని మమత బెనర్జీ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని