‘లఖింపుర్‌ దోషుల్ని 7రోజుల్లో అరెస్టు చేయకపోతే మోదీ ఇంటిని ముట్టడిస్తాం!’

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో దోషుల్ని అరెస్టు చేయాలని ఆజాద్‌ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌, దళిత నాయకుడు........

Published : 09 Oct 2021 02:00 IST

ఆజాద్‌ సమాజ్‌వాదీ పార్టీ నేత చంద్రశేఖర్‌ ఆజాద్‌ హెచ్చరిక

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో దోషుల్ని అరెస్టు చేయాలని ఆజాద్‌ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌, దళిత నాయకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. ఏడు రోజుల్లోగా  అరెస్టు చేయకపోతే ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రతి విషయంపైనా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్లు చేస్తారనీ.. మరి, రైతుల్ని చంపిన ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. ప్రధాని మోదీ లఖ్‌నవూలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకొంటున్న వేళ రైతుల కుటుంబాలు అక్కడ రోదిస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ లఖింపుర్‌ ఖేరి వెళ్లి ఆ రైతు కుటుంబ సభ్యులను పరామర్శించాలని కోరారు. యూపీలో శాంతిభద్రతలు లేవని, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన పదవికి రాజీనామా చేయాలని ఆజాద్‌ డిమాండ్‌ చేశారు.

ఆ కేంద్రమంత్రిని బర్త్‌రఫ్‌ చేయాల్సిందే..: కాంగ్రెస్‌ డిమాండ్‌

లఖింపుర్‌ ఖేరి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి డిస్మిస్‌ చేయాలని, ఆయన కుమారుడు అశీష్‌ని వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలపై ఇద్దరు సిట్టింగ్‌ జడ్జిలతో దర్యాప్తు జరిపించి బాధిత రైతుల కుటుంబాలకు 30 రోజుల్లో న్యాయం చేయాలని కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజధర్మాన్ని పాటించి.. నిందితులను అరెస్టు చేయించాలన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అజయ్‌ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్‌ చేసి.. నిందితుందరినీ అరెస్టు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌ అన్నారు. ఇద్దరు సిట్టింగ్‌ జడ్జిలతో కమిషన్‌ ఏర్పాటు చేసి దోషులను 30 రోజుల్లో శిక్షిస్తేనే రాజ్యాంగం, చట్టం పరిరక్షించబడతాయన్నారు. లేకపోతే వాటిపై ప్రజలు విశ్వాసం కోల్పోతారన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క నిందితుడినీ అరెస్టు చేయలేదని సూర్జేవాలా విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని