Presidential Election: ప్రత్యర్థి వర్గం ఓట్లపై యశ్వంత్‌ సిన్హా గురి!

ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ నేతల ఓట్లపై యశ్వంత్‌ సిన్హా గురిపెట్టారు. భాజపాలోని తన మిత్రుల మద్దతు కోరతానని ఆయన తెలిపారు........

Published : 28 Jun 2022 02:09 IST

భాజపాది సింబాలిజం రాజకీయం అంటూ విమర్శ

దిల్లీ: ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ నేతల ఓట్లపై యశ్వంత్‌ సిన్హా గురిపెట్టారు. భాజపాలోని తన మిత్రుల మద్దతు కోరతానని ఆయన తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential Election) విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీపడుతోన్న యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) సోమవారం నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తనకు ఈ అవకాశం దక్కడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తనను నాలుగో ఛాయిస్​గా ఎంపిక చేసినప్పటికీ ​తనకు ఎలాంటి భేషజాలు లేవని, 10వ ఛాయిస్​గా అవకాశం వచ్చినా సంతోషంగా స్వీకరించేవాడినని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలను మహాయుద్ధంగా అభివర్ణించారు.

రాష్ట్రపతి ఎన్నికల పోరులో తనకు మద్దతుగా నిలవాలని భాజపాలోని తన మిత్రులను సంప్రదిస్తానని సిన్హా ఈ సందర్భంగా తెలిపారు. ఒకప్పుడు తాను ఉన్న కమల దళానికి, ప్రస్తుత పార్టీకి ఎంతో తేడా ఉందన్నారు. భాజపాలో అంతర్గత ప్రజాస్వామ్యం కరవైందని విమర్శించారు. ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అభ్యర్థిత్వాన్ని ‘సింబాలిజం రాజకీయం’గా అభివర్ణించారు. వెనుకబడిన వర్గాల కోసం మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రభుత్వం గిరిజన మహిళను ఎంపిక చేసినంత మాత్రాన.. ఆ వర్గానికి ఏం ప్రయోజనం చేకూరుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ఎన్నికలను నిరంకుశ పాలనకు, స్వేచ్ఛకు మధ్య పోరుగా అభివర్ణించారు.

అటల్ బిహారి వాజ్‌పేయీ నేతృత్వంలోని ప్రభుత్వంలో యశ్వంత్‌ సిన్హా ఆర్థిక మంత్రిగా,  విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2018లో భాజపాకి రాజీనామా చేసిన ఆయన.. 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. టీఎంసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న సిన్హా.. జూన్ 21న తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించకముందే పార్టీకి రాజీనామా చేశారు. వాజ్‌పేయీకి సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి.

రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ వేశారు. దిల్లీలోని పార్లమెంట్ భవనంలో రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఈ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అలాగే నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సమయంలో ఆయన వెంట కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎన్‌సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు పలువురు విపక్షనేతలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని