Harish Rawat: టైం వచ్చినప్పుడు అన్నీ చెబుతానుగా.. హరీశ్ రావత్‌ మరో బాంబ్‌

కాంగ్రెస్‌ పార్టీలో అలజడి సృష్టించిన సీనియర్ నేత‌, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌.. తాజాగా మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్‌ను

Published : 23 Dec 2021 11:41 IST

దిల్లీ పెద్దల నుంచి పిలుపు

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో అలజడి సృష్టించిన సీనియర్ నేత‌, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌.. తాజాగా మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ రావత్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాటిపై వివరణ ఇచ్చేందుకు నిరాకరించిన ఆయన.. సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానన్నారు. 

‘‘సమయం వచ్చినప్పుడు.. నేను అన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మీతో కాకపోతే ఇంకెవరితో చెబుతాను. ఆ సందర్భం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను. ప్రస్తుతానికి ఈ పరిణామాలను ఆనందించండి’’ అని రావత్‌ విలేకరులతో అన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ఆయన పార్టీ నుంచి వైదొలుగుతారా లేదా పూర్తిగా రాజకీయాల నుంచే తప్పుకొంటారా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న హరీశ్ రావత్.. నిన్న ట్విటర్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు కాళ్లు, చేతులూ కట్టేసినట్లుగా ఉందని, ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందేమో అంటూ వరుస ట్వీట్లు చేశారు. తన భవిష్యత్‌ కార్యాచరణపై కొత్త సంవత్సరంలో నిర్ణయం తీసుకుంటానని సూచనప్రాయంగా వెల్లడించారు. మరికొద్ది నెలల్లో ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపాయి.

దిల్లీ వెళ్లనున్న రావత్‌..

ఈ ట్వీట్లతో అప్రమత్తమైన పార్టీ అధిష్ఠానం.. రావత్‌ సహా ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ పక్ష నేత ప్రీతమ్‌ సింగ్‌ను దిల్లీకి పిలిచింది. వీరిద్దరూ శుక్రవారం దేశ రాజధానికి వెళ్లి రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీని కలవనున్నట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని