Satyapal malik: ఏ రాజకీయ పార్టీలో చేరను.. ఎన్నికల్లోనూ పోటీ చేయను!

మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌గా తన పదవీకాలం పూర్తయిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. అలాగే, తాను  ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని.. ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చి చెప్పారు...

Published : 01 Oct 2022 02:27 IST

మేరఠ్‌: మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌గా తన పదవీకాలం పూర్తయిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. అలాగే, తాను  ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని.. ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. దీంతో ఆయన ఆర్‌ఎల్డీలో చేరతారంటూ కొనసాగిన ఊహాగానాలకు చెక్‌ పెట్టినట్టయింది. మేఘాలయ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌ పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా తన తదుపరి ప్రణాళికలపై ఓ వార్తా సంస్థతో మాలిక్‌ మాట్లాడారు. ‘‘నాకు ఎలాంటి ప్రణాళికలూ లేవు. రైతులకు సంబంధించిన కార్యకలాపాల్లో మాత్రమే భాగస్వామినవుతా. ఏ రాజకీయ పార్టీలో చేరను.. ఏ ఎన్నికల్లోనూ పోటీచేయను’’ అని స్పష్టంచేశారు. మరోవైపు, అక్టోబర్ 3న షామ్లీ జిల్లాలో జరిగే 'కిసాన్ సమ్మేళన్'లో మాలిక్‌ పాల్గొంటారని.. ఆర్‌ఎల్డీ చీఫ్‌ జయంత్‌ చౌదరితో వేదికను పంచుకుంటారంటూ ప్రకటనలు రావడంతో ఆయన ఆ పార్టీలోనే చేరతారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై మాలిక్‌ స్పందిస్తూ షామ్లీ సమావేశం రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం ఏర్పాటు చేయాలని భావించారని.. కానీ అక్కడ 144 సెక్షన్‌ ఉన్నందున ఆ సమావేశం రద్దయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతు ప్రకటించిన సత్యపాల్‌ మాలిక్‌.. జమ్మూకశ్మీర్‌లో అవినీతిపైనా బహిరంగంగానే గళం వినిపించిన సంగతి తెలిసిందే. 

1946 జులై 24న యూపీలోని బాగ్పాట్‌ జిల్లాలో జన్మించిన మాలిక్‌.. తొలుత భారతీయ క్రాంతిదళ్‌, కాంగ్రెస్‌, జనతాదళ్‌, లోక్‌దళ్‌, సమాజ్‌వాదీ పార్టీల్లో పనిచేశారు. ఆ తర్వాత భాజపాలో చేరారు. 1989లో అలీగఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన.. 1980 నుంచి 1989 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగారు. 2017 సెప్టెంబర్‌ 30న మాలిక్‌ తొలిసారి బిహార్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2018 ఆగస్టులో కేంద్రం ఆయన్ను జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా నియమించింది. ఆ తర్వాత 2020లో మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు