Mamata Banerjee: విపక్షాల ఐక్యత.. కాంగ్రెస్‌కు మద్దతిస్తాం..!

భాజపాను ఎదుర్కోవడంలో భాగంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (General Elections 2024) కాంగ్రెస్‌ పార్టీకి తాము మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రకటించారు.

Published : 16 May 2023 00:07 IST

కోల్‌కతా: 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత (Opposition Unity) కోసం ప్రయత్నాలు చేస్తున్న పలు పార్టీలు.. కాంగ్రెస్‌ను పక్కనపెట్టాయి. అయితే, తమ పార్టీ మద్దతు లేకుండా అది అసాధ్యమని కాంగ్రెస్‌ చెప్పుకుంటూ వస్తోంది. అయితే, తాజాగా కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్‌ విజయం తర్వాత పలు రాజకీయ పార్టీలు తమ ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందిస్తూ.. భాజపాకు వ్యతిరేకంగా జరిగే పోరులో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న చోట తాము మద్దతు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. విపక్షాల ఐక్యతపై ఇటీవల కాలంలో మమతా బెనర్జీ తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించడం ఇదే తొలిసారి.

‘కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట తప్పకుండా పోరాడాలి. వారికి మేం మద్దతు ఇస్తాం. అందులో తప్పేమీ లేదు. కానీ, వారు ఇతర పార్టీలకూ మద్దతు తెలపాలి’ అని మమతా బెనర్జీ వెల్లడించారు. కోల్‌కతా సెక్రటేరియట్‌లో విలేకరులతో మాట్లాడిన దీదీ.. తమ మద్దతు కావాలంటే కాంగ్రెస్‌ కూడా ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాలన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట భాజపా పోరాడలేదనే విషయం స్పష్టమైందన్నారు. ఇక సీట్ల పంపకంపైనా మమతా బెనర్జీ స్పష్టతనిచ్చారు. 2024 ఎన్నికల్లో భాజపాను దీటుగా ఎదుర్కోవాలంటే స్థానికంగా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు అధిక ప్రాధ్యాన్యం ఇవ్వాలన్నారు.

‘ఉదాహరణకు బెంగాల్‌ విషయాన్ని తీసుకుంటే.. ఇక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌ బలంగా ఉంది. దిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ, బిహార్‌లో ఇప్పటికే నీతీశ్‌, తేజస్వితో కాంగ్రెస్‌ కలిసే ఉంది. అక్కడ వాళ్లు నిర్ణయించుకొని ముందుకు వెళ్లాలి. తమిళనాట స్నేహపూర్వకంగా ఉన్న డీఎంకే, కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేయవచ్చు. ఝార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్‌లు కలిసే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ఆ పార్టీకి ప్రాధాన్యం ఇవ్వాలి’ అని మమతా బెనర్జీ ఇతర రాష్ట్రాలను ఉదహరించారు. తమ అంచనాల ప్రకారం 200 స్థానాల్లో కాంగ్రెస్‌ బలంగా ఉందన్న దీదీ.. అక్కడ తాము మద్దతు ఇస్తామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని