BJP: డిసెంబర్‌ 5నుంచి భాజపా కీలక సమావేశాలు.. అజెండా ఇదేనా?

గుజరాత్‌ మలి దశ ఎన్నికల పోలింగ్‌ (డిసెంబర్‌ 5న) సోమవారం జరగడంతో అదే రోజు నుంచి రెండు రోజుల పాటు దిల్లీలో పార్టీ కీలక సమావేశాలు నిర్వహించాలని కమలనాథులు నిర్ణయించారు.

Updated : 02 Dec 2022 17:26 IST

దిల్లీ: గుజరాత్‌ ఏడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా భాజపా నేతలు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. మోదీ, అమిత్‌ షా స్వరాష్ట్రమైన గుజరాత్‌లో రికార్డు స్థాయిలో గెలిచి తమ సత్తా చాటాలని సర్వశక్తులూ ధారపోస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మొదలుకొని ఆ పార్టీ అగ్రనేతలు అక్కడ చురుగ్గా ప్రచారంలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే, గుజరాత్‌ మలి దశ ఎన్నికల పోలింగ్‌ (డిసెంబర్‌ 5న) సోమవారం జరగడంతో అదే రోజు నుంచి రెండు రోజుల పాటు దిల్లీలో పార్టీ కీలక సమావేశాలు నిర్వహించాలని కమలనాథులు నిర్ణయించారు. దేశవ్యాప్తంగా భాజపా ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశాల్లో వచ్చే ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల సవాళ్లను ఎదుర్కొనేందుకు పార్టీ సన్నద్ధతపై సమీక్షించనున్నట్టు తెలుస్తోంది.

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ప్రారంభం కానున్న ఈ రెండ్రోజుల సమావేశాల్లో పార్టీ సంస్థాగత అంశాలతో పాటు భారత్‌కు జీ20 అధ్యక్ష బాధ్యతలు, ప్రపంచ మందగమనం నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధి తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు వచ్చే ఏడాది జరగబోయే త్రిపుర, కర్ణాటకతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఈ ఆఫీస్‌ బేరర్ల చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశాలకు జాతీయ స్థాయిలో పార్టీ సీనియర్‌ నేతలతో పాటు అన్ని రాష్ట్రాల భాజపా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రసంగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని