Shiv sena: శిందే వర్గం చేతికి శివసేన.. ఆ రెండింటి మాటేంటి?

Shiv Sena Bhavan - Saamana: రెండుగా చీలిన శివసేనకు సంబంధించి పార్టీ గుర్తు, పార్టీ పేరు ఇప్పటికే ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి చేరాయి. మరి పార్టీ ప్రధాన కార్యాలయం, సామ్నా పత్రికపై హక్కుల మాటేంటి?

Published : 24 Feb 2023 01:22 IST

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) వర్గానిదే అసలైన శివసేన (Shiv Sena) అంటూ ఎన్నికల సంఘం ఇటీవల తీర్పు ఇచ్చింది. పార్టీ గుర్తైన విల్లు-బాణం సైతం ఆ వర్గానికే కేటాయించింది. దీంతో అందరి దృష్టీ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన ‘శివసేన భవన్‌’, పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’ (Saamana)పై పడింది. ప్రస్తుతం ఈ రెండూ ఠాక్రే వర్గం చేతిలో ఉన్నాయి. వీటిని సైతం శిందే వర్గం స్వాధీనం చేసుకుంటుందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

శివసేన పార్టీ ప్రధాన కార్యాలయం అయిన ‘శివసేన భవన్‌’ సెంట్రల్‌ ముంబయిలోని దాదర్‌ ప్రాంతంలో ఉంది. ‘సామ్నా’ పత్రిక ప్రధాన కార్యాలయం ప్రభదేవి ప్రాంతంలో ఉంది. అయితే, ఈ రెండూ వేర్వేరు ట్రస్టుల పేరు మీద నడుస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యాలయం అయిన శివసేన భవన్‌.. శివాయి సేవా ట్రస్ట్‌ పేరుమీద నడుస్తోంది. బాల్‌ ఠాక్రే, ఆయన భార్య మీనా ఠాక్రే వ్యవస్థాపక ట్రస్టీలుగా ఉన్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే సహా మరికొందరు ప్రస్తుతం ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు ట్రస్టీలు ఉన్నప్పటికీ.. అందులో చాలా మంది కాలం చేశారు.

బాల్‌ ఠాక్రే ప్రారంభించిన ‘సామ్నా’ ప్రభోదన్‌ ప్రకాశన్‌ అనే ట్రస్ట్‌ పేరుమీద నడుస్తోంది. ఉద్ధవ్‌ ఠాక్రేకు ఆప్తుడైన సుభాష్‌ దేశాయ్‌ దీనికి ప్రింటర్‌-పబ్లిషర్‌గా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు వరకు ఈ పత్రికకు ఉద్ధవ్‌ ఎడిటర్‌గా వ్యవహరించారు. సీఎం అయ్యాక ఆయన సతీమణి రష్మీ ఠాక్రేకు ఆ బాధ్యతలు అప్పగించారు. గతేడాది ఆగస్టులో ఉద్ధవ్‌ మళ్లీ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ‘సామ్నా’కు సంజయ్‌ రౌత్‌ ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

అయితే, శివసేన భవన్‌, సామ్నా విషయంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఇప్పటికే స్పష్టతనిచ్చారు. పార్టీ పేరు, గుర్తు తన చేతికి వచ్చినప్పటికీ.. శివసేన భవన్‌, సామ్నాపై మాత్రం హక్కులను కోరబోనని పేర్కొన్నారు. అయినప్పటికీ ఠాక్రే వర్గం మాత్రం అప్రమత్తంగా ఉంది. ఇటీవలే ఆ పార్టీకి చెందిన నేత ఒకరు థానే పోలీస్‌ కమిషనర్‌కు కలిసి వినతి పత్రం సమర్పించారు. శాఖలను (పార్టీ ప్రాంతీయ కార్యాయాలు) శిందే వర్గం స్వాధీన ప్రయత్నాలు అడ్డుకోవాలన్నది అందులోని సారాంశం.

శివసేన భవన్‌, సామ్నాపై హక్కు విషయంలో ఏక్‌నాథ్‌ శిందే వివేకంతో నిర్ణయం తీసుకున్నారని సీనియర్‌ జర్నలిస్టు ప్రకాశ్‌ అకోల్కర్‌ అన్నారు. ప్రస్తుతం రెండు వేర్వేరు ట్రస్టుల కింద నడుస్తున్న వాటిపై హక్కులను కోరితే మరిన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ముంబయి, నగరం ఆవల సుమారు 350 శివసేన శాఖలు ఉన్నాయి. అయితే, ఇవి చాలా వరకు శాఖ ప్రముఖుల చేతిలోనో, ఆ కార్యాలయాలకు స్థలాలు ఇచ్చిన ప్రైవేటు వ్యక్తుల చేతిలోనో ఉన్నాయి. భవిష్యత్‌లో ఏ పార్టీకి ఇవి చెందుతాయనేది మాత్రం వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు