congress : మధ్యప్రదేశ్‌ దారుణం.. తీవ్ర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్

భాజపా పరిపాలనలో మహిళలకు భద్రత కరువైందని మధ్యప్రదేశ్‌లో జరిగిన 12 ఏళ్ల బాలిక అత్యాచార ఘటనపై  కాంగ్రెస్‌ నేత ప్రియాంకగాంధీ భాజపా ప్రభుత్వంపై మండిపడ్డారు.

Published : 28 Sep 2023 16:48 IST

భోపాల్:  మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అత్యాచారానికి గురై నడివీధిలో అర్ధనగ్నంగా రక్తమోడుతూ ఓ 12 ఏళ్ల బాలిక సాయం కోరిన దృశ్యాలు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అమానవీయ ఘటనపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi ) ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘దుండగుల చేతిలో అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక కు ఎవరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఆమె సాయం అందక రోడ్డుపైనే స్పృహతప్పి పడిపోయిన దృశ్యం నా మనసును ఎంతో కలచి వేశాయి. మధ్యప్రదేశ్‌లో శాంతి భద్రతలు, మహిళల భద్రత అంటే ఇదేనా? 20 ఏళ్ల భాజపా పాలనలో బాలికలకు, మహిళలకు, దళితులకు రక్షణ లేదు. ఆడబిడ్డలకు రక్షణ, గౌరవం ఇవ్వకుండా ఆడబిడ్డల కోసమే మా ప్రభుత్వం అంటూ ఎన్నికలలో ప్రచారం చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ’ అని ఆమె మధ్యప్రదేశ్‌ భాజపా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌ (Shivraj Singh Chouhan) పై మండిపడ్డారు.

ఎన్నికల ప్రచారానికి కాస్తా విరామం ఇస్తేనే ప్రధాని నరేంద్రమోదీకి (Narendra Modi), మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి మహిళల అర్తనాదాలు వినిపిస్తాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) భాజపా ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..

బాలిక ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్న ప్రస్తుతానికి ప్రమాదం లేదని ఓ అధికారి తెలిపారు. కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసినట్లు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్ర వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటికే ఆటో డ్రైవర్‌తో సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని