Prashant Kishor: ఎన్నికల్లో పోటీ చేసే ఆశ లేదు: ప్రశాంత్‌ కిశోర్‌

Prashant Kishor : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ బిహార్‌లో జన సురాజ్‌ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే, తనుకు తానుగా ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించే ఆకాంక్ష లేదని ఆయన తెలిపారు. 

Published : 13 Nov 2022 12:45 IST

పట్నా : తనకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆకాంక్ష లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. అయితే, తన సొంత రాష్ట్రం బిహార్‌ కోసం మాత్రం మెరుగైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం ‘జన సురాజ్‌’ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న ఆయన శనివారం చంపారణ్‌ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అని విలేకరులు పదే పదే ప్రశ్నించగా.. ‘‘నేనెందుకు ఎన్నికల్లో పోటీ చేస్తాను? నాకు అలాంటి ఆశలు లేవు’’ అని పశాంత్‌ కిశోర్‌ బదులిచ్చారు. మరోవైపు అధికార పార్టీ జేడీయూపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనని ‘స్వల్ప రాజకీయ చతురత ఉన్న వ్యాపారి’గా అభివర్ణించడంపై ఘాటుగా బదులిచ్చారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ తనను రెండేళ్ల పాటు ఎందుకు తన నివాసంలో ఉంచుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఒకవేళ తాను తిరిగి జేడీయూలో చేరితే నీతీశ్‌ మళ్లీ తనపై ప్రశంసలు కురిపిస్తారని తెలిపారు. తాను సొంతంగా ఒక కార్యాచరణతో ముందుకు వెళ్లడం నచ్చకే వారు తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

తాను గతంలో నీతీశ్‌ కుమార్‌తో పనిచేసినందుకు ఏమాత్రం పశ్చాత్తాపపడడం లేదని ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే నీతీశ్‌ చాలా మారిపోయాని చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ నీతీశ్‌ అధ్యక్ష పదవిని వదులుకున్నారని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు అధికారం కోసం ఎంతవరకైనా వెళుతున్నారని విమర్శించారు. మరోవైపు ప్రస్తుతం అధికారంలో ఉన్న జేడీయూ, ఆర్జేడీ కూటమి ఇచ్చిన ‘ఏడాదికి 10 లక్షల ఉద్యోగాల హామీ’ని సైతం కిశోర్‌ కొట్టిపారేశారు. ఒకవేళ ప్రభుత్వం దాన్ని నెరవేరిస్తే తాను జన్‌ సురాజ్‌ ప్రచారాన్ని విరమించుకుంటానని తెలిపారు.

‘జన్‌ సురాజ్‌’ను రాజకీయ పార్టీగా మార్చాలా.. వద్దా.. అనే విషయంపై ప్రశాంత్‌ కిశోర్‌ ఆయన బృందంతో కలిసి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఆదివారం పశ్చిమ చంపారణ్‌ జిల్లాలో కొనసాగనుంది. తర్వాత దీన్ని ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని